పారిశుద్ధ్య నిర్వహణలో అలసత్వం తగదు
నాదెండ్ల: గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, ఘనవ్యర్థాల నిర్వహణపై కార్యదర్శులు అలసత్వం వహించకుండా పనిచేయాలని, లేనిపక్షంలో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయతీ అధికారి విజయభాస్కర్‌రెడ్డి చెప్పారు. పలు గ్రామాల్లో గురువారం ఆయన పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ, ఘనవ్యర్థాల నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
బుక్కాపురంలో రోడ్ల వెంబడి చెత్త కుప్పలు ఉండటం, పారిశుద్ధ్య నిర్వహణపై గ్రామస్తులు పలు ఫిర్యాదులు ఆయన దృష్టికి తేవటంతో కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెమో జారీ చేశారు. ఎండుగుంపాలెం గ్రామంలో ఘనవ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని సందర్శించి పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యదర్శికి మెమో జారీ చేశారు. జంగాలపల్లెలో స్వామిత్వ సర్వే చివరి దశలో ఉండటంతో కార్యదర్శికి పలు సూచనలు చేశారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో అన్ని గ్రామాల కార్యదర్శులతో ఇంటి పన్ను వసూళ్లపై సమీక్ష నిర్వహించారు. ఇకనుంచి అన్ని గ్రామాల్లో 22 అడుగుల వెడల్పుతో రోడ్లు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఈఓపీఆర్డీ నిర్మలా లక్ష్మీకుమారి పాల్గొన్నారు.
డీపీఓ విజయభాస్కర్‌రెడ్డి ఇద్దరు కార్యదర్శులకు మెమోలు


