గొప్ప సామాజిక సంస్కర్త డాక్టర్‌ జగ్జీవన్‌రామ్‌ | - | Sakshi
Sakshi News home page

గొప్ప సామాజిక సంస్కర్త డాక్టర్‌ జగ్జీవన్‌రామ్‌

Apr 6 2025 2:35 AM | Updated on Apr 6 2025 2:35 AM

గొప్ప సామాజిక సంస్కర్త డాక్టర్‌ జగ్జీవన్‌రామ్‌

గొప్ప సామాజిక సంస్కర్త డాక్టర్‌ జగ్జీవన్‌రామ్‌

బాపట్ల: గొప్ప సామాజిక సంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా సంయుక్త కలెక్టర్‌ ప్రఖర్‌ జైన్‌ అన్నారు. మాజీ ఉప ప్రధాని డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి కార్యక్రమం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ బాలికల వసతి గృహంలో శనివారం నిర్వహించారు. జగ్జీవన్‌ రామ్‌ చిత్రపటానికి జిల్లా సంయుక్త కలెక్టర్‌ ప్రఖర్‌ జైన్‌, బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్రవర్మ, బుడా చైర్మన్‌ సలగల రాజశేఖర్‌బాబు, ఆర్డీఓ పి గ్లోరియా తదితరులు పుష్పమాలలతో నివాళులర్పించారు. జగ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ జగ్జీవన్‌రామ్‌ను ప్రేరణగా తీసుకుని విద్యార్థినులు ముందుకు సాగాలని చెప్పారు. ఎస్సీల నుంచి తొలి రాజకీయ నాయకుడు, భారత ఉప ప్రధానిగా ఎదిగిన గొప్ప వ్యక్తిగా ఆయన అభివర్ణించారు. మంత్రి పదవులను సమర్థంగా నిర్వహించారని, మంత్రిగా ఆయన పనిచేసిన కాలంలో హరిత విప్లవం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. పేదరికం నుండి వచ్చిన జగ్జీవన్‌రామ్‌ ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారని, భారతదేశ సంక్షేమం కోసం ఎన్నో సంస్కరణలు చేశారన్నారు. ఆర్థికంగా అత్యంత వెనుకబడిన సామాజిక వర్గాలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రతినెలా మూడో శుక్రవారం ఎస్టీలు, దివ్యాంగుల కోసం ప్రత్యేక పీజీఆర్‌ఎస్‌ నిర్వహిస్తున్నామని చెప్పారు. స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా జిల్లాలో మూడు వేల మందికి ఆధార్‌ కార్డులు, జనన ధ్రువీకరణ పత్రాలు ఉచితంగా అందించామన్నారు. జగ్జీవన్‌రామ్‌, అంబేద్కర్‌ సాధించిన విజయాలను భావితరాలకు వివరించాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వారి జయంతి కార్యక్రమాలను ప్రభుత్వ వసతి గృహాలలో నిర్వహించాలని ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాలను ప్రభుత్వం దేవాలయాలుగా భావిస్తున్నందున ఇక్కడే నిర్వహిస్తామన్నారు. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ మాట్లాడుతూ భారతమాత ముద్దుబిడ్డ జగ్జీవన్‌రామ్‌ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ శాఖ జిల్లా సాధికారత అధికారి రాజ్‌ దెబోరా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఎస్‌ విజయమ్మ, ఎస్సీ, ఎస్టీ నాయకులు చారువాక, ఎన్‌ ధర్మానాయక్‌, జి నాగమణి తదితరులు పాల్గొన్నారు.

జాయింట్‌ కలెక్టర్‌ ప్రఖర్‌జైన్‌ ఘనంగా జయంతి వేడుకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement