ఎరువుల వ్యాపారి ఉడాయింపు
మాచర్ల రూరల్: ఫర్టిలైజర్ వ్యాపారి నగదుతో ఉడాయించడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని తాళ్లపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు నాళం అమర నాగేశ్వరరావు ఎరువులు, పురుగు మందుల వ్యాపారం చేస్తూ గ్రామంలో సుమారు 50 మందికి పైగా రైతుల వద్ద రూ. 2.50 కోట్ల మేర అప్పులు తీసుకున్నాడు. కొందరి వద్ద పంట కొనుగోలు చేసి, మరికొందరి వద్ద ప్రామిసరీ నోట్లు, స్థలాలు, పొలాలు, అమ్మకం అగ్రిమెంట్లు రాసి నగదు తీసుకొని పరారయ్యాడు. సోమవారం గ్రామానికి చెందిన రైతులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తహసీల్దార్ బి.కిరణ్ కుమార్‌ను వినతి పత్రం అందించారు. తనకు చెందిన పొలం, ఇళ్లు, స్ధలాలు విక్రయిస్తానని అగ్రిమెంట్ రాసి రెండు రోజుల నుంచి కనిపించకుండా వెళ్లాడని, ఇంటికి తాళం వేసి సెల్‌ఫోన్ స్విచ్ ఆపి కుటుంబ సభ్యులు మొత్తం కన్పించటం లేదని వారు తహసీల్దార్‌కు తెలిపారు. అమర నాగేశ్వరరావుకు చెందిన ఆస్తులను ఇతరులకు అమ్మకుండా వచ్చే నగదును రైతులమైన మాకు చెందేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దీని పై స్పందించిన కిరణ్ కుమార్ సబ్ రిజిష్ట్రార్ కార్యాలయం, రూరల్ పోలీసులను సంప్రదించాలని సూచించారు. దీంతో వారు ఆయా కార్యాలయాలకు వెళ్ళి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అందించినట్లు తెలిపారు.
● ఇదిలా ఉండగా గత ఆరు నెలల కాలంలో సుమారు రూ. 100 కోట్ల వరకు వివిధ వ్యాపార వర్గాలు ఐపీ నోటీసులు దాఖలు చేయటం మాచర్ల పట్టణంలో సంచలనం రేకెత్తిస్తుంది. అప్పులిచ్చిన వ్యాపారులు, రైతులు ఆందోళన చెందుతున్నారు.


