మహిళలకు అండగా శక్తి యాప్
బాపట్ల టౌన్: శక్తి యాప్ వినియోగంపై మహిళలు, విద్యార్థినులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ తుషార్‌డూడీ తెలిపారు. బుధవారం జిల్లాలోని పలు చోట్ల యాప్‌పై పోలీసులు అవగాహన కల్పించారు. మహిళలు, విద్యార్థినులు ఒంటరిగా ప్రయాణించే సందర్భంలో సేఫ్ ట్రావెల్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.
మిర్చివ్యాపారి అదృశ్యంపై కేసు
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడుకు చెందిన ఓ మిర్చి వ్యాపారి అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్ల పాడు, అబ్బూరు, ఫిరంగిపురం మండలం 113త్యాళ్లూరు, యర్రగుంట్లపాడు తదితర గ్రామాల్లో రైతుల అంగీకారంతో మిర్చి వ్యాపారి తిరుములరావు ఏటా మిర్చి తూకాలు వేసి, వాహనాల్లో లోడు చేసుకుని తరలించేవాడు. గుంటూరులో బడా వ్యాపారులకు విక్రయించి రైతులకు నగదు చెల్లించేవారు. ప్రస్తుత సీజనులో సుమారు 50 మంది రైతుల నుంచి సుమారు రూ. 2 కోట్ల విలువైన మిర్చి సేకరించి గుంటూరులోని ఓ గోదాములో నిల్వ చేశారని, సోదరుడి సహాయంతో కొన్ని దుకాణాలకు నమూనాలు పంపి విక్రయించారని రైతులు ఆరోపిస్తున్నారు. నగదు కోసం రైతులు వ్యాపారి ఇంటికి వెళితే సుమారు పది రోజులుగా కనిపించడం లేదని చెబుతున్నారన్నారు. ఈ క్రమంలో లక్కరాజుగార్లపాడుకు చెందిన కొందరు రైతులు సత్తెనపల్లి రూరల్ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పది క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
తాళ్ళయపాలెం(తాడికొండ): అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసిన ఘటన తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం తాళ్ళాయపాలెం గ్రామంలో నల్లబజారుకు తరలించేందుకు 20 సంచుల్లో సిద్ధంగా ఉంచిన 10 కిలోల రేషన్ బియ్యాన్ని మంగళవారం అర్ధరాత్రి పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఎస్‌ఐ బాబురావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడులలో రేషన్ బియ్యంతో పాటు వాటిని తరలిస్తున్న ఉగ్గం అజయ్ కుమార్, మొగిలి వెంకట్రావులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తుళ్ళూరు ఎస్‌ఐ బాబురావు తెలిపారు.


