యువ శాస్త్రవేత్తలుగా ఎంపికై న విద్యార్థులకు అభినందన
గుంటూరు ఎడ్యుకేషన్: ఇస్రో యువికా యువ శాస్త్రవేత్త కార్యక్రమానికి గుంటూరు జిల్లా నుంచి ఎంపికై న విద్యార్థులను జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ ఏ.భార్గవ్‌తేజ అభినందించారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో భార్గవ్‌తేజ మాట్లాడుతూ ఇస్రో యువికా యువ శాస్త్రవేత్త కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా 3.50 లక్షల మంది పోటీ పడగా, అందులో కేవలం 350 మంది ఎంపికయ్యారని అన్నారు. వారిలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికై న 10 మంది విద్యార్థుల్లో గుంటూరు జిల్లాకు చెందిన ముట్లూరు జెడ్పీ హైస్కూల్ 9వ తరగతి విద్యార్థి సందు పవన్‌దుర్గ, డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ విద్యార్థి వక్కపట్ల సోమశేఖర్ ఉండడం జిల్లాకు గర్వకారణమన్నారు. మే 18 నుంచి 31 వరకు శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రంలో జరగనున్న యువికా యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాంలో పాల్గొనున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక, ముట్లూరు జెడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం జోస్ మేరీ పాల్గొన్నారు.


