చినగంజాం: మండలంలోని సంతరావూరు గ్రామం నుంచి అద్దంకికి తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఇంకొల్లు పోలీసులు పట్టుకున్నారు. ఇంకొల్లు ఎస్‌ఐ జి. సురేష్ కథనం ప్రకారం చినగంజాం మండలంలోని సంతరావూరు గ్రామం నుంచి అద్దంకికి మినీ లారీలో బుధవారం వేకువ జామున అక్రమంగా తరలిస్తున్న 28 బస్తాల రేషన్ బియ్యాన్ని ముందస్తు సమాచారంతో పట్టుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
అభయాంజనేయ స్వామి ఆలయానికి విరాళం
పర్చూరు(చినగంజాం): పర్చూరులో వేంచేసియున్న అభయాంజనేయ స్వామి దేవస్థానం ప్రాంగణంలో గది నిర్మాణం కోసం దాతలు రూ. 5,25,116 విరాళంగా అందజేశారు. దేవరపల్లి గ్రామానికి చెందిన రావి రంగనాథ బాబు, నాగవర్ధని దంపతులు తమ కుమారుడు రావి శ్రీధర్ జ్ఞాపకార్థం బుధవారం కమిటీ సభ్యులకు ఈ విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కోట హరిబాబు, కటారి సురేంద్రబాబు, రంగిశెట్టి ఆంజనేయులు, తులసి శివనాగేశ్వరరావు, కృష్ణంశెట్టి శ్రీనివాసరావు, నర్రా రామయ్య, రంగిశెట్టి రామాంజనేయులు, మంగళగిరి కోటేశ్వరరావు, ఒగ్గిశెట్టి నరసింహారావు, దాసరి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగోన్నతుల జాబితాలో ఎస్జీటీలను చేర్చాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో ఉద్యోగోన్నతుల ద్వారా భర్తీ చేయనున్న స్కూల్ అసిస్టెంట్ తెలుగు సబ్జెక్టు సీనియారిటీ జాబితాలో అర్హత కలిగిన ఎస్జీటీలను చేర్చాలని ఏపీటీఎఫ్(1938) జిల్లా ప్రధాన కార్యదర్శి కె. నరసింహారావు, ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మేకల సుబ్బారావు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం నగరపాలెంలోని స్టాల్ బాలికోన్నత పాఠశాలలో డీఈవో సీవీ రేణుకను కలసిన ఏపీటీఎఫ్ ప్రతినిధులు వినతి పత్రం సమర్పించారు. డిగ్రీలో స్పెషల్ తెలుగు, బీఈడీలో తెలుగు మెధడాలజీ కలిగిన వారిని సైతం సీనియార్టీ జాబితాలో చేర్చాలని కోరారు. డీఈవోను కలసిన వారిలో ఉపాధ్యాయులు ఉన్నారు.
రూ.5కోట్ల వసూలే లక్ష్యం!
● ఈ ఏడాది ముందస్తు
ఆస్తి పన్నుపై అధికారుల కన్ను
● పురపాలక సంఘంలో
మూడు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు
నరసరావుపేట: పురపాలకసంఘ పరిధిలో నివాసం ఉంటున్న గృహ, వాణిజ్య సముదాయాల యజమానుల నుంచి రూ.5కోట్ల అడ్వాన్స్‌డ్ ఆస్తిపన్ను వసూలును పురపాలక అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. గతేడాది రూ.3.5కోట్లు మాత్రమే వసూలయింది. ఈ మేరకు పన్నుల సేకరణకు పురపాలక కార్యాలయంలో మూడు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. రెండు వాహనాల ద్వారా పట్టణంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈనెలాఖరులోపు వచ్చే ఏడాదికి ఆస్తిపన్ను ముందస్తుగా చెల్లించిన వారికి ఐదుశాతం రాయితీని ప్రభుత్వం కల్పించింది. దీంతో పాటు ఈ ఏడాది కూడా యజమానులు 15 శాతం అధికంగా ఆస్తిపన్ను పెంచి చెల్లించాల్సి ఉంటుందని పురపాలక రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు పేర్కొన్నారు. కాగా గత మార్చి 31నాటికి ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.12కోట్ల పన్నులు వసూలు కావాల్సివుండగా అందులో 85శాతం రూ.10.2కోట్లు వసూలైనట్లు పేర్కొన్నారు. మరో రూ.7కోట్లు పెండింగ్ పన్నులు ఉండగా, వాటిలో రూ.1.5కోట్లవరకు వసూలు చేసినట్లు పేర్కొన్నారు.
రేషన్ బియ్యం పట్టివేత


