బీచ్‌ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
బాపట్ల: సూర్యలంక, రామాపురం బీచ్‌లను జులై నెలలోగా మెరుగైన పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. పర్యాటక శాఖ అధికారులు, కన్సల్టెంట్‌లతో బుధవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాపట్ల జిల్లా పర్యాటకంగా మరింత కీలక ప్రాంతం కానుందని చెప్పారు. జులై నెల నాటికి బోటింగ్ షికార్ అందుబాటులోకి తెచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. పర్యావరణ కాలుష్యం లేని ప్రాంతంగా ఈ రెండు బీచ్‌లను ప్రాథమికంగా గుర్తించినట్లు చెప్పారు. ఇప్పటికే 20 మంది శాస్త్రవేత్తలు ఆ రెండు బీచ్‌లలో అధ్యయనం చేశారని వివరించారు. రాజస్థాన్, గుజరాత్ తరహాలో తీర్చిదిద్దడానికి అడుగులు వేస్తున్నామన్నారు. జిల్లాలో జీడిపప్పు ఉత్పత్తి అధికంగా ఉన్నందున విక్రయాలు, ప్రదర్శనలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాటిచెట్ల ఆధారంగా ఉత్పత్తులు పెంచేలా కల్లు గీత కార్మికులకు, బోటింగ్ షికారు జరిగేలా మత్స్యకారులకు కల్గరి శిక్షణ ఇవ్వాలన్నారు. చేనేత ఉత్పత్తుల పెంపు, ప్రదర్శనలకు చర్యలు తీసుకుంటామన్నారు. వాడరేవు వద్ద రెవెన్యూ అసోసియేషన్‌కు సంబంధించిన ఎకరా భూమిని ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తామన్నారు. లేదంటే ఏజెన్సీలకు ఆ భూమిని లీజ్‌కు ఇవ్వడానికి పరిశీలిస్తామన్నారు. పేరళి కెనాల్ బోటింగ్‌కు అనువైన ప్రాంతం కాగా, పర్యాటకుల కోసం సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. బీచ్‌ల వద్ద రిసార్ట్స్ నిర్వహణపై రూపొందించిన నివేదికలపై ఆయన చర్చించారు. అత్యవసర అభివృద్ధి పనులకు రూ.1.13 కోట్ల నిధులతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, పర్యాటక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ నాయుడు, కన్సల్టెంట్ సాహితీ దివి, జిల్లా పర్యాటక శాఖ అధికారి నాగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మహిళా శిశు సంక్షేమానికి పథకాలు
బాపట్ల: మహిళా శిశు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అన్నారు. బుధవారం స్థానిక సాయిరామ్ గార్డెన్ కన్వెన్షన్ హాల్‌లో జిల్లా స్థాయి పోషణ్ పక్వాడ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని ఈ నెల 8 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించడానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గర్భిణులకు అవగాహన కల్పించారు. అనాథ శిశువుల కోసం రైల్వే స్టేషన్లో, బస్టాండ్‌లో ఊయలలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో సఖి వన్ స్టాప్ సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. బాపట్ల శాసనసభ్యు వేగేశన నరేంద్ర వర్మ మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు. 20 మంది గర్భిణులకు వేగేశన ఫౌండేషన్ ద్వారా రూ.5 వేల వంతున ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాల్స్‌ను జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి రాధా మాధవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాజ్ దిబోరా, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, జిల్లా గ్రామీణ నీటి సరఫరా శాఖ ఎస్‌ఈ అనంతరాజు, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి పి.గ్లోరియా, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
బీచ్‌ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు


