జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి
తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని అందించిన జర్నలిస్టులు
చీరాలటౌన్: ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం....ప్రజలకు అండగా నిలుస్తున్న నాలుగో స్తంభమైన మీడియాపై, పాత్రికేయులపై అక్రమంగా కేసులు పెట్టడం దుర్మార్గం...పత్రికా స్వేచ్ఛకు భంగం వాటిల్లిస్తున్న కారకులను కఠినంగా శిక్షించాలి....జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనుంజయ్‌రెడ్డి, పల్నాడుకు చెందిన ఆరుగురు జర్నలిస్టులపై ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తు చీరాల ప్రాంత జర్నలిస్టులు, మీడియా సోదరులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తహసీల్దార్ కె.గోపీకృష్ణకు వినతిపత్రాన్ని అందించారు. జర్నలిస్టు ప్రతినిధులు మాట్లాడుతూ సమాజంలో నాలుగో స్తంభంగా ఉన్న మీడియా రంగంపై ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించడంతోపాటుగా వార్తలు రాసిన, ప్రచురించిన జర్నలిస్టులపై అక్రమ కేసులు నమోదు చేయడం దుర్మార్గమన్నారు. కీలకమైన మీడియా రంగంపై ఆంక్షలు విధించడంతో పాటుగా అక్రమంగా కేసులు నమోదు చేసి భయబ్రాంతులకు గురయ్యేలా చేయడం దారుణమన్నారు. పల్నాడు జిల్లాలో జరిగిన సంఘటనను ప్రజలకు తెలియజేసిన జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం ప్రభుత్వ వ్యవహార శైలికి నిదర్శమన్నారు. జర్నలిస్టులపై అక్రమంగా కేసులను ఎత్తివేయడంతో పాటుగా పాత్రికేయులను ఇబ్బందులకు గురిచేస్తే ఉద్యమాలు, ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. తహసీల్దార్ మాట్లాడుతూ చీరాల జర్నలిస్టులు అదించిన వినతిపత్రాన్ని ఉన్నతాధికారులకు అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో చీరాల ప్రాంతంలోని జర్నలిస్టులు కె.మురళి, కె.వాసుబాబు, బి.గురునాధం, ఎస్వీ కృష్ణారెడ్డి, ఎన్.రమేష్, కె.వాసు, ఎస్.స్వామినాఽథ్, జి.గోపి, రాజేష్, రత్నం తదితరులు ఉన్నారు.
అద్దంకిలో...
అద్దంకి: పల్నాడు జిల్లాలో సాక్షిలో ప్రచురితమైన వార్తకు సంబంధించి సాక్షి ఎడిటర్ ధనుజయ్‌రెడ్డి, మరో ఆరుగురు జర్నలిస్ట్‌లపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని ఏపీయూడబ్ల్యూజే బాపట్ల జిల్లా అధ్యక్షుడు చెన్నుపాటి రాంబాబు డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరుతూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రింట్,అ ండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్‌లు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సీఐ సుబ్బరాజుకు వినితి పత్రం అందజేశారు. రాంబాబు మాట్లాడుతూ వార్తలు ప్రచురించిన సందర్భంగా కేసులు పెట్టడం అన్యామన్నారు. ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారికి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు వైవీ రామిరెడ్డి, ఏ సోమ శ్రీనివాసరావు, రావుట్ల శ్రీనివాసరావు, నాగూర్‌వలి, కొండలరావు, సర్దార్ ఖాన్, నరిశెట్టి నాగేశ్వరరావు, అనీల్, శివప్రసాద్, వలేటి శ్రీనివాసరావు, సింగయ్య, దుర్గారావు, శ్యామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి


