పట్టణ పరిసరాల్లో తోటల సాగుపై ప్రత్యేక శిక్షణ
వ్యవసాయ కళాశాల డీన్ డాక్టర్ ప్రసూనా రాణి
బాపట్ల: అర్బన్ కేంద్రాల పరిసరాలలో ఆకు కూరలు, కూరగాయలు, పండ్లు, పూల పెంపకం చేసే విధానం ద్వారా ఆహార భద్రత కలుగుతుందని వ్యవసాయ కళాశాల డీన్ డాక్టరు పి.ప్రసూనారాణి పేర్కొన్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో బుధవారం రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో డీన్ మాట్లాడారు. కూరగాయాలకు స్థానిక మార్కెట్లలో ప్రాధాన్యత పెరుగుతుందని, సాగుభూమి విస్తీర్ణానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. పట్టణ పరిసరాలలో జీవించే చిన్న, సన్నకారు రైతుల కమతాలలో పెంచదగిన కూరగాయలు, వాటి సాగులో తీసుకోవలసిన మెలకువలు గురించి శిక్షణ శిబిరంలో తెలియజేశారు. ఉద్యాన విభాగాధిపతి డా. వి.శ్రీలత రైతులకు పూల తయారీ, వాటికి మార్కెట్‌లో ఉన్న ప్రాముఖ్యత గురించి వివరించారు. డా.యన్.రత్నకుమారి, డా.కె.సుశీల, డా.ఎం.సురేష్ కుమార్, ఉద్యాన విభాగ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.


