పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలి
జిల్లా పంచాయతీ అధికారి కేఎల్ ప్రభాకర్‌రావు
కర్లపాలెం: పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి కేఎల్ ప్రభాకర్‌రావు చెప్పారు. దమ్మనవారిపాలెం ఘన వ్యర్ధ పదార్ధాల నిర్వహణ కేంద్రంలో బుధవారం ఎనిమిది గ్రామ పంచాయతీలలోని పారిశుద్ధ్య కార్మికులకు, పంచాయతీ కార్యదర్శులకు పారిశుద్ధ్య కార్యక్రమాలపై ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన డీపీఓ కేఎల్ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ గ్రామాలలో పారిశుద్ధ్యం పనుల బాధ్యత గ్రామ పంచాయతీ కార్యదర్శులపై, పారిశుద్ధ్య కార్మికులపై ఉందన్నారు. ప్లాస్టిక్ వాడటం వలన పర్యావరణానికి హాని కలుగుతుందని ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఎంపీడీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామస్తులు తమ ఇళ్లల్లోని తడిచెత్త, పొడిచెత్తను వేర్వేరు డబ్బాలలో వేసి తమకు అందజేసే విధంగా పారిశుద్ధ్య కార్మికులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామ సర్పంచ్ గురపుసాల వెంకటేశ్వరమ్మ, ఈఓపీఆర్డీ శ్రీనివాసరావు, కార్యదర్శి తిరుమలరెడ్డి, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.


