తెనాలి డీఎస్పీకి ఏబీసీడీ అవార్డు
తెనాలి రూరల్: సంచలనం సృష్టించిన దళిత బాలిక హత్య కేసును ఛేదించిన తెనాలి డీఎస్పీ బి.జనార్ధనరావు ఏబీసీడీ (అవార్డ్ ఫర్ బెస్ట్ క్రైం డిటెక్షన్) కన్సోలేషన్ ప్రైజ్ అవార్డు (డీజీపీ మెడల్) అందుకున్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంకు చెందిన ఏడో తరగతి చదువుతున్న దళిత బాలిక పేరిపోగు శైలజను గ్యాస్ డెలివరీ బాయ్‌గా పని చేసే కృష్ణా జిల్లాకు చెందిన నరమామిడి నాగరాజు గతేడాది దారుణంగా హత్య చేయడం.. ఘటన రాష్ట్‌ట్రవ్యాప్తంగా సంచలనంగా మారడం తెలిసిందే. కేసును చేబ్రోలు పోలీసులు నమోదు చేయగా, డీఎస్పీ జనార్ధనరావు దర్యాప్తు చేశారు. హత్యకు పాల్పడి పరారైన నాగరాజు, తన సెల్‌ఫోన్, సిమ్‌ను మార్చి వేసి పోలీసులకు సవాల్ విసిరాడు. సుమారు మూడు నెలల పాటు నిందితుడి ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నించి అతికష్టం మీద అతడిని గుర్తించి అరెస్ట్ చేశారు. కీలకమైన కేసును ఛేదించడంలో కృషి చేసిన డీఎస్పీ, చేబ్రోలు పోలీసులను డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా అభినందించారు. మంగళగిరిలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో తెనాలి డీఎస్పీకి ఏబీసీడీ కన్సోలేషన్ ప్రైజ్ అవార్డును డీజీపీ అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీకి తెనాలి సబ్ డివిజన్ పోలీస్ అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.
పోలీసులకు అవార్డులు..
చేబ్రోలు: కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పేరుపోగు శైలజ హత్య కేసులో నిందితుడు ఎన్.నాగరాజు కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానంతో నాగరాజును పట్టుకొని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన పొన్నూరు రూరల్ సీఐ వై.కోటేశ్వరరావు, చేబ్రోలు ఎస్‌ఐ డి.వెంకట కృష్ణ, చేబ్రోలు పీఎస్ కానిస్టేబుళ్లు ఎ.అప్పలనాయుడు, జి.నాగరాజులకు అవార్డులను అందజేసినట్లు పోలీసులు తెలిపారు.


