లంక గ్రామాల ప్రజలకు ఉపాధి కల్పించండి
ఆర్డీఓని కోరిన వైఎస్సార్ సీపీ వేమూరు ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబు
వేమూరు: లంక గ్రామాల్లో ఇసుక తవ్వకాల్లో యంత్రాలను నిషేధించి కూలీలకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ వేమూరు నియోజక వర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు రేపల్లె ఆర్డీఓ రామలక్ష్మి దృష్టికి తీసుకెళ్లారు. రేపల్లె రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో బుధవారం ఆర్డీఓను కలిసి పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. నదీ తీరప్రాంతాల్లో ఇసుక తవ్వకాల్లో యంత్రాలు ఉపయోగించకుండా లంక ప్రాంతాల్లోని కూలీల చేత చేయించాలన్నారు. ఇతర ప్రాంతాలకు అక్రమంగా ఇసుక తరలివెళ్లకుండా అడ్డుకోవాలని ఆయన కోరారు. ఇసుక తరలింపు కోసం కొందరు నదిలో రోడ్లు సైతం వేస్తున్నారని, వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుని, రోడ్లను ఛిద్రం చేయాలన్నారు. ఇసుక తవ్వకాల్లో పూర్తిగా లంక గ్రామాలకు చెందిన కూలీలను వినియోగించాలని ఆయన కోరారు.


