మాతాశిశు మరణాలను నివారించాలి
మాతాశిశు మరణాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి డాక్టర్లను ఆదేశించారు. గత సంవత్సరం ఆగస్టు మాసంలో సంభవించిన 2 ప్రసవ మరణాలపై జిల్లా కలెక్టర్ మాతాశిశు మరణాల కమిటీ సభ్యులతో బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. నిడమానూరు గ్రామానికి చెందిన మానికల లక్ష్మి మృతికి సంబంధించి తొమ్మిదో ప్రసవం అని, ఎక్కువ రిస్క్ ఉందని నమోదు చేయడాన్ని పరిశీలించారు. వైద్య అందించిన తీరుపై అసహనం వ్యక్తపరిచారు. సంబంధిత డాక్టర్లు, సిబ్బందిపై తగు చర్యలను తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు. కారుమూరి ఆశ మరణంపై ఆరా తీశారు. ప్రసవం తర్వాత ఆమె డయేరియాతో చనిపోయారని రేపల్లె కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డాక్టర్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, డాక్టర్ రామకృష్ణ, వైద్యం అందించిన డాక్టర్లు, కమ్యూనిటీ హెల్త్ అధికారులు, హెల్త్ ఎడ్యుకేటర్లు, పబ్లిక్ హెల్త్ నర్సులు, హెల్త్ ప్రోగ్రామర్, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.


