మార్టూరులో మరో చోరీ
మార్టూరు: వరుస దొంగతనాల మార్టూరు మండలం ప్రజలు బెంబేలెత్తుతున్నారు. తాజా శుక్రవారం తెల్లవారుజామున మార్టూరులో స్థానిక జాతీయ రహదారి పక్కన గల ఎంఆర్‌ఎఫ్ టైర్ల షోరూమ్‌లో చోరీ జరిగింది. షోరూం యజమాని కొల్లా రాము తెలిపిన వివరాలు... గురువారం రాత్రి వ్యాపార లావాదేవీల అనంతరం రూ.50 వేల నగదును క్యాష్ కౌంటర్లో ఉంచి యధా ప్రకారం షట్టర్ తాళం వేసి ఇంటికి వెళ్లారు. శుక్రవారం తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో మొహం కనిపించకుండా మాస్క్ ధరించిన ఓ గుర్తు తెలియని అగంతకుడు షోరూం షట్టర్ తాళం ధ్వంసం చేసి లోనికి ప్రవేశించాడు. నేరుగా క్యాష్ కౌంటర్ వద్దకు వెళ్లి అందులోని రూ.50వేల నగదు తీసుకెళ్లాడు. సమీపంలో ఉన్న యజమాని రాముకు చెందిన పాత బట్టల కవర్‌ను సైతం అగంతకుడు తీసుకొని వెళ్లిపోయాడు. తెల్లవారిన తర్వాత షట్టర్ తెరచి ఉండడం గమనించిన స్థానికుల సమాచారంతో షోరూం యజమాని రాము పోలీసులకు సమాచారం అందించాడు. రాముతో కలిసి షోరూమ్ లోని సీసీ కెమెరాను పరిశీలించిన పోలీసులు నిందితుడు ఆనవాళ్లను గమనించారు. రాము సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాలో చోరీ జరిగిన తీరును గమనించిన షోరూమ్ యజమాని రాము ఇది ఖచ్చితంగా తెలిసిన వారి పనేనని తెలిపారు.


