కొమర్నేనివారిపాలెంలో చోరీ
పర్చూరు(చినగంజాం): మండలంలోని కొమర్నేనివారిపాలెంలో శుక్రవారం దొంగతనం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎర్రా వెంకట సుబ్బయ్య ఇంటిలో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. బీరువాలో ఉన్న 10 సవర్ల బంగారం, రూ.14 వేలు నగదు, ఒక టీవీని అపహరించుకొని వెళ్లారు. గ్రామంలో శుభకార్యం జరుగుతున్న సమయంలో ఇంటిలోకి దొంగలు ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డారు. ఇంటికి వచ్చిన వెంకట సుబ్బయ్య తలుపులు తీసి ఉండటం, ఇంటిలోని బీరువాలోని బట్టలు చిందరవందరగా పడి ఉండటంతో తన ఇంటిలో దొంగతనం జరిగిందని గుర్తించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్న ఎస్‌ఐ మాల్యాద్రి ఇంటి పరిసరాలను పరిశీలించి, క్లూస్‌టీంను పిలిపించి వివరాలను సేకరించారు. బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు.


