ఇంద్రకీలాద్రికి పెరిగిన రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వారాంతం, పండుగలు, వేసవి సెలవుల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం కావడంతో తెల్లవారుజాము నుంచే పెద్దఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి విచ్చేసిన యాత్రికులతో ఉదయం 7 గంటల నుంచే ఆలయ ప్రాంగణంలో క్యూలైన్లలో రద్దీ కనిపించింది. మధ్యాహ్నం 3 గంటల వరకు రద్దీ కొనసాగగా, ఆది దంపతులకు నిర్వహించిన ఆర్జిత సేవల్లో ఉభయదాతలు పాల్గొన్నారు. నూతన వధూవరులు పెళ్లి దుస్తుల్లో అమ్మ వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
అంతరాలయ దర్శనం రద్దు
రద్దీ నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచే అంతరాలయ దర్శనాన్ని ఆలయ అధికారులు రద్దు చేశారు. రూ.300, రూ.100 టికెట్లను మాత్రమే విక్రయించారు. దీంతో వీఐపీల పేరిట వచ్చే భక్తులతో పాటు సిఫార్సు లేఖలపై వచ్చే వారికి సైతం ముఖ మండప దర్శనం మాత్రమే కల్పించారు. రద్దీ నేపథ్యంలో సర్వ దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. మధ్యాహ్నం అమ్మవారికి మహా నివేదన సమర్పించేందుకు అర్ధగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేశారు. దీంతో ఆలయంలో రద్దీ మరింత పెరిగింది. రద్దీ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా భక్తులు ముందుకు కదిలేలా ఆలయానికి చెందిన వివిధ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది క్యూలైన్లను పర్యవేక్షించారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత అంతరాలయ దర్శనాన్ని పునరుద్ధరించారు.
ఆర్జిత సేవలకు డిమాండ్...
చైత్ర మాసం కావడంతో శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు.


