ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పర్యావరణానికి పెనుముప్పు
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యర్థాలు పర్యావరణానికి పెనుముప్పు అని, వాటిని శాసీ్త్రయ పద్ధతిలో నాశనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయనంద్ చెప్పారు. శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా ఈ–వ్యర్థాల నిర్వహణపై గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మరెడ్డి పట్టాభిరామ్, కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ ఏ. భార్గవ్‌తేజ, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, నగరపాలక సంస్థ ఇన్‌చార్జి మేయర్ షేక్ సజీలా, ఎమ్మెల్యేలు మహమ్మద్ నసీర్ అహ్మద్, గల్లా మాధవి, బూర్ల రామాంజనేయులతో కలిసి విజ్ఞాన మందిరం ఆవరణలో మెక్కలు నాటి, నగరంలో ఈ – వ్యర్థాల సేకరణ చేసే వాహనాన్ని ప్రారంభించి, సిగ్నేచర్ క్యాంపెయిన్‌లో సంతకం చేశారు. వివిధ రంగాల స్టాళ్లను పరిశీలించారు. సీఎస్ మాట్లాడుతూ ఈ–వ్యర్థాల ఉత్పత్తి ఎక్కువగా ఉందని, వాటిని ఎక్కడపడితే అక్కడ పారేస్తే భూ కాలుష్యం, నీటి కాలుష్యం పెరిగి ప్రజలు అనారోగ్యానికి గురవుతారని పేర్కొన్నారు. ఈ–వ్యర్థాల సేకరణకు గుంటూరుతోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రెడ్యూస్, రీ యూజ్, రీసైక్లీంగ్ (ఆర్‌ఆర్‌ఆర్) సెంటర్లను ఏర్పాటుచేసినట్టు వివరించారు. ఈ–వ్యర్థాలను ఆర్‌ఆర్‌ఆర్ సెంటర్ల నిర్వహణ ద్వారా సంపద సృష్టించవచ్చని, దీని కోసం ప్రభుత్వం ప్రత్యేక పాలసీని తీసుకురానుందని వివరించారు. రాష్ట్రంలో మూడు నెలలుగా జరు గుతున్న స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో 1.90 కోట్ల మంది పాల్గొన్నారని, స్వచ్ఛత కార్యక్రమాలను ఉద్యమంగా యుద్ధప్రాతిపదికన ప్రజలు, అధికారులు, ప్రజాప్రతి నిధులు, స్వచ్ఛంద సేవ సంస్థల భాగస్వామ్యంతో కొనసాగించటం ద్వారా స్వచ్ఛంద్ర తద్వారా స్వర్ణాంధ్ర సాధ్యం అవుతుందన్నారు. కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఈ–వ్యర్థాల సేకరణకు ప్రత్యేకంగా ఆర్‌ఆర్‌ఆర్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. గుంటూరులోని ప్రతి సచివాలయంలో ఆర్ ఆర్ ఆర్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.


