జగనన్న కాలనీల్లో వసతులు కల్పించాలి
మంత్రి అనగానికి వినతి
రేపల్లెరూరల్: పట్టణంలోని జగనన్న కాలనీలో కనీస వసతులు కల్పించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో కాలనీవాసులు శనివారం మంత్రి అనగాని సత్యప్రసాద్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. సీపీఎం పట్టణ కార్యదర్శి మణిలాల్ మాట్లాడుతూ జగనన్న కాలనీలో కనీస వసతులు కరువై ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సొంతగూటి కోసం అప్పులు చేసి గృహాలు నిర్మించుకున్న కాలనీవాసులు కాలనీలో వసతులు లేకపోవటంతో నివాసం ఉండలేని పరిస్థితులు వచ్చాయన్నారు. జగనన్నకాలనీ పేరును తొలగించి పీఎంవై ఎన్టీఆర్ కాలనీగా మార్చిన ప్రభుత్వం వసతులు మాత్రం కల్పించలేదన్నారు. డ్రయిన్లు, రహదారులు లేక మురుగు నివాస గృహాల మధ్య నిలిచి పారిశుద్ధ్యం క్షీణించటంతోపాటు దోమలు వృద్ధి చెంది క్షణకాలం ఉండలేని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఇప్పటికై నా పాలకులు, అధికారులు స్పందించి కాలనీలో కనీస వసతులు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీి కన్వీనర్ వి.ధనమ్మ, కో–కన్వీనర్ రవికుమార్, సహాయ కార్యదర్శి కె.నాంచారమ్మ, సభ్యులు వనజాక్షి, కృష్ణకుమారి, రాధా తదితరులు పాల్గొన్నారు.


