వక్ఫ్ బిల్లును ఉపసంహరించుకోవాలి
చీరాల రూరల్: కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామని, ఆ చట్టాన్ని తక్షణమే విరమించుకోవాలని బాపట్ల జిల్లా ముస్లిం సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ముస్లిం మనోభావాలను దెబ్బతీస్తూ రాజ్యాంగ విరుద్ధంగా బిల్లు ప్రవేశపెట్టారని ధ్వజమెత్తారు. ఆదివారం చీరాల వెంగళరావు నగర్‌లోని షాదీఖానాలో జిల్లా ముస్లిం సంఘ నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎంతో కాలంగా ఉన్న వక్ఫ్ బోర్డును నిర్వీర్యం చేసి, వక్ఫ్ ఆస్తులను లాక్కుని దేశంలోని బడా కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన 15, 21, 25, 26, 29 ఆర్టికల్స్‌కు విరుద్ధంగా కేంద్రం పని చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులను సభ్యులుగా చేర్చుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 26ను ఉల్లంఘించడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని ఉపసంహరించుకుని ప్రజారంజక పరిపాలనపై దృష్టి సారించాలని కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికారు. వక్ఫ్‌బోర్డు చట్ట సవరణకు నిరసనగా ఈనెల 25న ముస్లిం సంఘాలతో భారీ శాంతి ర్యాలీ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి షేక్ హుమాయున్ కబీర్, అబ్దుల్ రెహమాన్, వైఎస్సార్ సీపీ చీరాల అధ్యక్షుడు షేక్ అల్లాభక్షు, షౌకత్‌ఆలీ, ముక్తీమహమ్మద్ షఫీ, హబీబుల్లా సాహెబ్, అబ్దుల్ సలీం, సీఐటీయూ బాబురావు, కమ్రుద్దీన్, చీరాల ప్రాంతంలోని ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.
బాపట్ల జిల్లా ముస్లిం సంఘాల నాయకుల డిమాండ్ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 25న నిరసన ర్యాలీ


