అక్రమ కేసులకు బెదిరేది లేదు
మార్టూరు: ‘మా పార్టీ నాయకుడు దాసం హనుమంతరావును రాజకీయ ఒత్తిళ్లతోనే పోలీసులు పథకం ప్రకారం అరెస్టు చేశారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదు. తప్పకుండా న్యాయపోరాటం చేస్తాం’ అని పర్చూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి గాదె మధుసూదనరెడ్డి పేర్కొన్నారు. మార్టూరు పోలీస్ స్టేషన్ సమీపంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 31వ తేదీ వరకు హనుమంతరావు లైసెన్సు కలిగి ఉన్నాడని పోలీసులే చెబుతున్నారని, రెండు దశాబ్దాలుగా వ్యాపారం చేస్తున్న వ్యక్తి తిరిగి రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్న విషయాన్ని పోలీసులు ఉద్దేశపూర్వకంగానే దాచి పెడుతున్నారని ఆయన ఆరోపించారు. హనుమంతరావు ఇల్లు, గ్రానైట్ ఫ్యాక్టరీల్లో పేలుడు పదార్థాలు లభించినట్లు పోలీసులు ఎక్కడా చెప్పలేదని, అయినా తప్పుడు వార్తలు ఎలా ప్రచురించారని ఆయన ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని, హనుమంతరావు తరఫున కోర్టులో పోరాడతామని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు.
కలిసేందుకు ససేమిరా..
హనుమంతరావును ఒకసారి కలిసి వెళ్తామని సీఐ శేషగిరిరావును మధుసూదన్‌రెడ్డి కోరగా అందుకు ఆయన అనుమతించలేదు. రెండు దశాబ్దాలుగా వ్యాపారం చేస్తున్న హనుమంతరావుపై రాజకీయ ఒత్తిళ్లతోనే కేసులు బనాయించి అరెస్టు చేయడం పద్ధతి కాదని పోలీసుల తీరును గాదె తప్పుబట్టారు. లైసెన్స్ రెన్యువల్ కొలిక్కి వచ్చే సమయంలో హనుమంతరావును అరెస్టు చేయడం వెనుక ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయో అందరికీ తెలుసని, ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారని మధుసూదనరెడ్డి పేర్కొన్నారు.
న్యాయ పోరాటం చేస్తా.. బాధితులకు అండగా ఉంటా.. వైఎస్సార్ సీపీ పర్చూరు ఇన్‌చార్జి గాదె మధుసూదనరెడ్డి


