పేలుడు పదార్థాలు స్వాధీనం
మార్టూరు: మార్టూరు మండలం నాగరాజుపల్లి గ్రామ సమీపంలో గ్రానైట్, క్రషర్లలో వినియోగించే పేలుడు పదార్థాలతోపాటు ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు బాపట్ల డీఎస్పీ జి రామాంజనేయులు తెలిపారు. మార్టూరు పోలీస్ స్టేషన్‌లో ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నాగరాజుపల్లి గ్రామానికి చెందిన దాసం హనుమంతరావు గ్రానైట్ క్వారీలలో ముడి రాయిని పగలకొట్టడం కోసం వినియోగించే జిలెటిన్ స్టిక్స్ వ్యాపారం రెండు దశాబ్దాలుగా చేస్తున్నాడు. అదే గ్రామంలో 135/7,137/7 సర్వే నంబర్లలోని భూమి మిడాల నాగ వేణుగోపాల్‌కు చెందినది. ఈ భూమిని దాసం హనుమంతరావు లీజుకు తీసుకొని గోడౌన్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో మార్టూరు సీఐ శేషగిరిరావు శనివారం రాత్రి తమ సిబ్బందితో గోడౌన్లో తనిఖీలు నిర్వహించి అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై హనుమంతరావును అతని అన్న కుమారుడు దాసం వీరాంజనేయులును శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. దాసం హనుమంతరావును ఏ–1గాను, దాసం వీరాంజనేయులును ఏ–2గా, నాగండ్ల ప్రసన్నను ఏ–3గా, బత్తుల సాంబశివరావును ఏ–4గా, ప్రతాపరెడ్డిని ఏ–5గా, తెలంగాణ రాష్ట్రానికి చెందిన సాల్వో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఏ–6 చేర్చినట్లు డీఎస్పీ తెలిపారు. పోలీసుల తనిఖీలో 20 లక్షల రూపాయల విలువైన పేలుడు సామాగ్రితోపాటు ఒక అశోక్ లేలాండ్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని దాసం హనుమంతరావును, దాసం వీరాంజనేయులును కోర్టుకు హాజరు పరచనున్నట్లు తెలిపారు. భూమి యజమాని మిడాల నాగవేణుగోపాల్‌కు పేలుడు పదార్థాలకు సంబంధించిన లైసెన్స్ 31.3.2025 తేదీ వరకు ఉందని హనుమంతరావు ఆ భూమికి లీజుదారుగా ఉంటూ కొన్ని సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో మార్టూరు, సంతమాగులూరు సీఐలు శేషగిరిరావు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
ఆరుగురిపై కేసు నమోదు పోలీసుల అదుపులో ఇద్దరు? విలేకరుల సమావేశంలో డీఎస్పీ రామాంజనేయులు


