బీచ్‌లను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలి
చీరాల: చీరాల నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా చేపట్టాలని, బీచ్‌లను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అన్నారు. చీరాల నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, పర్యాటక ప్రాంతం అభివృద్ధిపై జిల్లా స్థాయి అధికారులతో సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. చీరాలలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి రూ.10.2 కోట్ల నిధులతో జలజీవన్ మిషన్ కింద పనులు చేపడతామన్నారు. గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి సరఫరా కోసం రూ.60 లక్షలు ఆర్‌డబ్ల్యూఎస్ ద్వారా మంజూరు చేస్తామన్నారు. చీరాల పరిధిలోని ఐదు ఎత్తిపోతల పథకాల మరమ్మతులు చేయడానికి యుద్ధప్రాతిపదికన ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.8.25 కోట్లతో అభివృద్ధి పనులు చేయడానికి నిధులు కేటాయింపులు జరగగా అదనంగా మరో రూ.1.75 కోట్ల నిధులు వెచ్చిస్తామన్నారు. డిఎఫ్‌ఎం కింద మరో రూ.2 కోట్లు నిధులు బీచ్‌ల అభివృద్ధికి మంజూరు చేస్తామన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.1.50 కోట్లతో చీరాల పట్టణంలో మురికినీటి వ్యవస్థ అభివృద్ధికి కార్యక్రమాలు ప్రారంభిస్తామన్నారు. రూ.150 కోట్లతో చీరాలలో ఫిషింగ్ హార్బర్ నిర్మించడానికి తయారుచేసిన డీపీఆర్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించాలన్నారు. చీరాల వాడరేవు, రామాపురం బీచ్‌లలో బయో టాయిలెట్స్ నిర్మిస్తామన్నారు. పర్యాటక రంగంగా మారనున్న బీచ్‌ల వద్ద రక్షణ చర్యలు పెంచాలని పోలీస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రైల్వే ట్రాక్‌పై ఆర్వోబీ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. మసీదు సెంటర్, పేరాల రైల్వేగేటు వద్ద ట్రాఫిక్‌ను నియంత్రించాలన్నారు. అభివృద్ధి పనులు వేగంగా చేపట్టడానికి కొన్నింటికి ప్రతిపాదనలు, మరికొన్నింటికి టెండర్లు పిలవాలన్నారు. పనుల్లో జాప్యం వద్దని అధికారులకు సూచించారు. ప్రతి నెలా రెండు రోజులు నియోజకవర్గ స్థాయిలో పీజీఆర్‌ఎస్ నిర్వహిస్తామన్నారు. నియోజకవర్గంలో మురుగునీటి వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కాల్‌మనీ తరహాలో వడ్డీ వ్యాపారులు ప్రజల నుంచి అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారన్నారు. ఇంటి స్థలాలు లేక పేదలు కాలువ కట్టలపై ఉంటున్నారన్నారు. విద్యుత్ సరఫరా మెరుగుపరిచేందుకు నియోజకవర్గంలో రెండు విద్యుత్ సబ్‌స్టేషన్లు నిర్మించాలన్నారు. చీరాల నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి జరిగేలా సహకరించాలని ఆయన కలెక్టర్‌కు వివరించారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, డీఆర్వో జి.గంగాధర్ గౌడ్, ఆర్డీఓ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ తదితరులు పాల్గొన్నారు.
చీరాలలో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.10.2 కోట్లు పేరాల, మసీదు సెంటర్లలో ట్రాఫిక్ నియంత్రించాలి నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష


