జాతీయ రహదారుల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయండి
అధికారులకు ఎంపీ తెన్నేటి ఆదేశం
చీరాలటౌన్: జిల్లా పరిధిలో నిర్మాణం చేస్తున్న జాతీ య రహదారుల పనులను నాణ్యంగా, త్వరగా పూర్తి చేయాలని బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ ఆదేశించారు. సోమవారం చీరాల ఆర్డీవో కార్యాలయంలో చీరాల ఎమ్మెల్యే ఎంఎం.కొండయ్యతో కలిసి ఎంపీ జాతీయ రహదారులపై సంబంధిత శాఖ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ నేషనల్ హైవే అథారిటి అధికారులు విధులు సమర్థంగా నిర్వర్తించి జాతీయ రహదారి నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్నా రు. వివిధ జిల్లాలను కలుపుతూ నిర్మాణం చేస్తున్న 167–ఏ వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ రహదారి పనులు సకాలంలో పూర్తయ్యేలా కృషి చేయాలన్నారు. 216 రహదారిలో గుంతలు లేకుండా చూడాలన్నారు. జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయిన వారిలో కొంతమందికి నష్టపరిహారం సక్రమంగా రాలేదని ఫిర్యాదులు వచ్చాయని వాటిని త్వరగా పరిష్కరించి నష్టపరిహారం అందించాలని ఆదేశించారు. నాణ్యతలో రాజీలేకుండా నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జేసీ ప్రఖర్‌జైన్, ఆర్డీవో టి.చంద్రశేఖర నాయుడు, తహసీల్దార్లు గోపికృష్ణ, పార్వతి, నేషనల్ హైవే అథారిటి అధికారులు పాల్గొన్నారు.


