ఎన్‌సీసీతో విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు
వేటపాలెం: విద్యార్థులు ఎన్‌సీసీలో చేరడం ద్వారా ఉన్నత చదువులు, ఉద్యోగాల్లో రిజర్వేషన్ పొందే అవకాశం ఉందని ప్రధానోపాధ్యాయుడు ఎం. శేఖరరావు తెలిపారు. పందిళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలో బుధవారం ఎన్‌సీసీ క్యాడెట్స్‌కి సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్బంగా హెచ్‌ఎం మాట్లాడుతూ ఎన్‌సీసీలో చేరిన 43 మంది విద్యార్థులకు ప్రభుత్వం నుంచి ఒక్కొక్కరికీ రూ.4,400 చొప్పన రూ.1,89,200 మంజూరైనట్లు తెలిపారు. ఈ నగదుతో ఒకొక్క క్యాడెట్‌కి రెండు జతల సూట్లు, రెండు జతల బూట్లు, రెండు టీ షర్టులు, బెల్టు, నేమ్ ప్లేట్, లైన్ యాడ్ అందజేసినట్లు తెలిపారు. విద్యార్థులు ఎన్‌సీసీలో చేరడం వల్ల దేశభక్తి, క్రమశిక్షణ, త్యాగం, ధైర్యం అలవడి సమాజ సేవలో ఉత్సాహంగా పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎస్. లలితా పరమేశ్వరి, ఉమ్మిటి వేణుగోపాలరావు, సీహెచ్. భవానీదేవి, వి.ఎల్. నరసింహం, బుద్ది మోహనరావు, ఎద్దు రత్నం, గుంటూరు శివశంకర్, చైతన్య పాల్గొన్నారు.


