‘సాక్షి’పై దాడి అప్రజాస్వామికం
సాక్షి ప్రతినిధి, బాపట్ల: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సాక్షి దినపత్రిక కార్యాలయంపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులతో దాడిచేసి కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ బుధవారం బాపట్లలో జర్నలిస్టులు నిరసన తెలిపారు. దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు. ఇది అప్రజాస్వామికమని తప్పుబట్టారు. బాధ్యతాయుత ప్రజాప్రతినిధులు పత్రికా కార్యాలయంపై దాడికి దిగడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. దాడికి నిరసనగా బుధవారం పాత్రికేయులు జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల వద్ద నిరసన తెలిపారు. జర్నలిస్టులపై దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. దాడి చేసిన వారిపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసులు పెట్టి, దాడులు చేసి పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేయాలనుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ వెంకటమురళి, ఏఎస్పీ విఠలేశ్వర్‌లకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పాత్రికేయులు బిజివేముల రమణారెడ్డి, ఆర్. ధనరాజ్, రాఘవ, కె. ప్రశాంత్, ఉమామాహేశ్వరరావు, పి.వెంకట్, అంజయ్య, గణేష్, శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, రవితేజ, అన్నాధరావు, చంటి, బొట్టు కృష్ణ, సాల్మన్‌రాజు, మరియదాసు పాల్గొన్నారు.
ఆగ్రహించిన జర్నలిస్టులు
బాధ్యులపై కఠిన చర్యలకు డిమాండ్
ఏలూరు సాక్షి కార్యాలయంపై
చింతమనేని అనుచరుల దాడి హేయం
‘సాక్షి’పై దాడి అప్రజాస్వామికం


