
వెదుళ్లపల్లిలో ‘అగ్నివీర్’ అంత్యక్రియలు
బాపట్లటౌన్: వ్యక్తిగత కారణాలతో రాజస్థాన్‌లో ఆత్మహత్య చేసుకున్న అగ్నివీర్ మేడిబోయిన వెంకటదుర్గారెడ్డి మృతదేహాన్ని ఆర్మీ అధికారులు శనివారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుటుంబసభ్యులు, మాజీ సైనికుల ఆధ్వర్యంలో వెదుళ్లపల్లిలోని స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. మాజీ సైనికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు ఆధ్వర్యంలో మాజీ సైనికులు వెదుళ్ళపల్లి గ్రామానికి చేరుకొని అగ్నివీర్‌కు పార్ధీవదేహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ అగ్నివీర్‌గా ఉద్యోగంలో చేరి ఒక సంవత్సరం, 10 నెలలు మాత్రమే అయ్యిందన్నారు. క్షణికావేశంలో చిన్నవయస్సులోనే మృతిచెందడం బాధాకరమన్నారు. జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గుణషీలా, సూపరింటెండెంట్ ఆనందరావులు అగ్నివీర్‌కు నివాళులర్పించారు. బాపట్ల అసోసియేషన్ అధ్యక్షుడు పుట్ట ఆదిశేషారెడ్డి, ఉపాధ్యక్షుడు చలికొండ వెంకటకృష్ణారావు, బాపట్ల జిల్లా అసోసియేషన్ ట్రెజరర్ షేక్ నిజాముద్దీన్, సీనియర్ మాజీ సైనికుడు కె.ఆంజనేయులు, 23 ఎన్‌సీసీ ఆంధ్ర బెటాలియన్ అధికారులు పాల్గొన్నారు.