● అమలుకు నోచని
రామాలయం–గోదావరి మధ్య వంతెన
● యాదగిరిగుట్టతో పాటే భద్రాచలం అభివృద్ధికీ ప్రణాళిక
● పదేళ్ల క్రితమే సస్పెన్షన్ బ్రిడ్జి డిజైన్లు ఇచ్చిన ఆర్ట్ డైరెక్టర్
● కనీసం తీగల వంతైనెనా
నిర్మించాలంటున్న భక్తులు
భద్రగిరి అభివృద్ధికి మార్గం..
టెంపుల్ టూరిజంలో భాగంగా భద్రాచలంలో ఆలయం నుంచి గోదావరి కరకట్ట వరకు సస్పెన్షన్ బ్రిడ్జి (తీగల వంతెన) నిర్మించాలని భక్తులు కోరుతున్నారు. భద్రాచలం వచ్చిన భక్తుల్లో చాలా మంది సీతారాముల దర్శనానికి ముందు పావన గోదావరిలో స్నానం ఆచరించడం, అక్కడ పూజాదికాలు నిర్వహించడం ఆనవాయితీగా భావిస్తారు. మరికొందరు దర్శనం చేసుకున్న తర్వాత గోదావరి తీరానికి వెళ్లి నదిలో నీటిని తలపై చల్లుకుంటారు. అందువల్ల ఆలయం నుంచి కరకట్ట వరకు నడుచుకుంటూ వెళ్లేందుకు వీలుగా ఐకానిక్ సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మిస్తే భద్రాచలం క్షేత్రానికి కొత్త శోభ వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. భద్రాచలం అభివృద్ధి కోసం ప్రస్తుతం రూపొందిస్తున్న ప్రతిపాదనల్లో సస్పెన్షన్ బ్రిడ్జికి చోటు కల్పించాలనే డిమాండ్‌కు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది.


