భవనం పైనుంచి పడి కార్మికుడు మృతి
గుండాల: భవనం పైనుంచి పడి డైలీవేజ్ వర్కర్ మృతి చెందిన ఘటన మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. ఆళ్లపల్లి ఎస్‌ఐ రతీశ్ కథనం ప్రకారం.. మండలంలోని కాచనపల్లి గ్రామానికి చెందిన పూనెం సతీశ్ (30) మామకన్ను ఆశ్రమ పాఠశాలలో డైలీవేజ్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం వంట పనులు ముగించుకుని తన ఇంటికి (హాస్టల్‌లోని క్వార్టర్ – ఫస్ట్ ఫ్లోర్) వెళ్లాడు. రాత్రి 10 గంటల సమయంలో బయటకు రాగా కాలు జారి పిట్టగోడ పైనుంచి కిందపడ్డాడు. గమనించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు 108 ద్వారా గుండాల ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ఆళ్లపల్లి ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతుడు అప్పుడుప్పుడూ మద్యం సేవిస్తాడని, కంటిచూపు సరిగా లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఉగాది రోజున సతీశ్ మృతి చెందడంతో కుంటుంబంలో, కాచనపల్లిలో తీవ్ర విషాదం అలుముకుంది. ఆస్పత్రిలో మృతదేహం వద్ద రాత్రి నుంచి తెల్లవారే వరకు హాస్టల్ సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరని కుటుంబ సభ్యులు ఆరోపించారు.


