వక్ఫ్ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది..
ఇల్లెందురూరల్: కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా అమలు చేసేందుకు యత్నిస్తున్న వక్ఫ్ బిల్లును కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఎమ్మెల్యే కోరం కనకయ్య స్పష్టం చేశారు. సోమవారం ఈద్గాలో ముస్లింలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ముస్లింలకు తరతరాలుగా స్థిర ఆస్థిగా ఉన్న భూములను అన్యాక్రాంతం చేసే ఉద్దేశంతోనే కేంద్రం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. వక్ఫ్ భూములపై కేంద్రం బిల్లు ఆమోదించుకున్నా.. తమిళనాడు ప్రభుత్వం తరహాలో రాష్ట్రంలోనూ కొనసాగేంచేలా సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే వారి పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటిమాదిరిగానే హిందూముస్లింలు సోదర భావంతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు ఇనాయితుల్లా, ఇబ్రహీం, ఏఎంసీ చైర్మన్ బానోత్ రాంబాబు, కాంగ్రెస్ నాయకులు పులి సైదులు, రాముమహేష్, మడుగు సాంబమూర్తి, బోళ్ల సూర్యం, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కోరం కనకయ్య


