పాముకాటుతో బాలుడి మృతి
ములకలపల్లి: పాము కాటువేయడంతో బాలుడు మృతి చెందిన ఘటన జగన్నాథపురంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వ్యాపారి బొల్లిపల్లి సురేశ్, హేమలత దంపతుల కుమారుడు సాయి సుకుమార్ (11) ఇంటి ఆవరణలో బాల్‌తో ఆడుకుంటున్నాడు. కాగా బాల్ సమీపంలోని రంధ్రంలోకి వెళ్లింది. సాయిసుమార్ బాల్ తీస్తుండగా చేతిపై ఏదో కుట్టింది. దీంతో బాలుడు కొద్దిసేపటి తర్వాత కుటుంబీకులకు విషయం తెలిపాడు. వారు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా వాంతులై పరిస్థితి విషమించింది. పాల్వంచ ఆస్పత్రికి చేరాక పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలుడు మృతి చెందాడని తెలిపారు. తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.
బెల్లం, పటిక స్వాధీనం
జూలూరుపాడు: మండలంలోని పాపకొల్లు గ్రామానికి చెందిన వర్షిత్‌కు చెందిన కిరాణా దుకాణంలో మంగళవారం ఎకై ్సజ్ పోలీసులు దాడులు చేశారు. నాటు సారాకు వినియోగించే 90 కిలోల బెల్లం, 8 కిలోల పటికను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసినట్లు ఎకై ్సజ్ సీఐ ఎల్.జయశ్రీ, తెలిపారు.
జామాయిల్ తోట దగ్ధం
బూర్గంపాడు: మండల పరిధిలోని ఇరవెండి గ్రామానికి చెందిన రైతు రామకృష్ణ సాగు చేసిన జామాయిల్ తోట ప్రమాదవశాత్తు పూర్తిగా దగ్ధమైంది. మంగళవారం మధ్యాహ్నం జామాయిల్ తోటలో మంటలు వస్తుండటాన్ని గమనించిన ఇరుగుపొరుగు రైతులు రామకృష్ణకు సమాచారమిచ్చారు. ఆయన అక్కడకు చేరుకునే సరికే తోట మొత్తం కాలిపోయింది. గుర్తు తెలియని వ్యక్తులే జామాయిల్ తోటకు నిప్పు పెట్టి ఉంటారని బాధితరైతు ఆరోపిస్తున్నారు. జామాయిల్ తోట కాలిపోవటంతో సుమారు రూ 8 లక్షల నష్టం వాటిల్లిందని బాధిత రైతు తెలిపారు.


