భద్రాచలంటౌన్: ఇటీవల విడుదలైన చిత్రం కోర్టులో హీరోగా నటించిన, పట్టణానికి చెందిన రోషన్ మంగళవారం భద్రాచలంలో సందడి చేశారు. సినిమా విడుదలై విజయవంతమైన సందర్భంగా సొంత ఊరు వచ్చిన రోషన్‌కు మిత్రులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని మిత్రులు, బంధువుల ఇళ్లకు వెళ్లి పలకరించాడు. అనంతరం పలువురు ప్రముఖులు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
14 మందిపై కేసు నమోదు
కారు, 10బైక్‌లు, రూ.60వేల నగదు స్వాధీనం
టేకులపల్లి: చిత్తూ బొత్తు ఆడుతున్న 14 మందిపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. టేకులపల్లి ఎస్‌ఐ పి.సురేష్ కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని సమ్మక్క సారలమ్మ గద్దెల సమీపంలో కొందరు యువకులు చిత్తూ బొత్తు ఆడుతుండగా టాస్క్‌ఫోర్స్, టేకులపల్లి పోలీసులు దాడి చేశారు. మూడ్ పవన్, మూడ్ గణేష్, గుగులోత్ వెంకన్న, మూడ్ భాస్కర్, భూక్యా ద్వాలియా, గుగులోత్ భద్రు, బానోత్ సురేందర్, అంగోత్ తులసీరామ్, చాపల వెంకన్న, జూలూరుపాడుకు చెందిన తేజవత్ నర్సింహా, మస్తాన్, గొడుగు వీరబాబు, జంగం రాము, భూక్యా అజయ్, గుగులోత్ గోపాల్, బాదావత్ శివలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వారి నుంచి కారు, 10 బైక్‌లు, రూ.60వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
దారి విషయంలో ఘర్షణ
వేంసూరు: దారి వివాదమై ఇరువర్గాలు ఘర్షణ పడిన ఘటన మండలంలోని జయలక్ష్మీపురంలో మంగళవారం చోటు చేసుకుంది. కొంత కాలంగా జయలక్ష్మీపురం ఎస్సీ కాలనీలో దారి విషయమై వివాదం నెలకొంది. దీంతో అప్పటి తహసీల్దార్, సర్వేయర్ హద్దులు నిర్ణయించారు. అయితే, మంగళవారం ఓ వర్గానికి చెందిన వ్యక్తి గతంలో హద్దులు నిర్ణయించిన దారికి ఫెన్సింగ్ వేశాడు. దీంతో ఎస్సీ కాలనీవాసులు అడ్డుకునేందుకు వెళ్లగా కాలనీకే చెందిన ఇరువర్గాల నడుమ ఘర్షణ చోటు చేసుకుంది. రెండు వర్గాల పరస్పరం దాడులకు దిగగా, ఆతర్వాత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
రైలు కిందపడి మృతి
బోనకల్: బోనకల్ రైల్వేస్టేషన్ సమీపాన మంగళవారం రైలు నుంచి కింద పడడంతో గుర్తుతెలియని వ్యక్తి(30) మృతి చెందాడు. ఈమేరకు అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించినట్లు జీఆర్‌పీ హెడ్ కానిస్టేబుల్ కర్రి శ్రీనివాసరావు తెలిపారు.
భద్రాచలంలో హీరో రోషన్ సందడి


