సంతానలేమి సమస్యకు చెక్..
● జిల్లా కేంద్రంలో సంతాన సాఫల్య కేంద్రం ఏర్పాటుకు కసరత్తు ● ఇప్పటికే వైద్యవిధాన పరిషత్ అధికారులతో చర్చించిన కలెక్టర్
ఇల్లెందు: ఎంతో మంది పిల్లలు లేక అవస్థలు పడుతున్నారు. సంతానం లేదనే కారణంతో కొందరు దంపతులు విడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విభాగంలో సంతాన సాఫల్య కేంద్రం ఏర్పాటు చేస్తే ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుందని జిల్లాలోని వైద్య విధాన పరిషత్ అధికారులు భావిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సంతాన సాఫల్య కేంద్రం ఏర్పాటు చేయాలని కసరత్తు చేస్తున్నారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్, హైదరాబాద్‌లోని హెల్త్ డైరెక్టర్ కూడా ఇక్కడి అధికారులతో చర్చించారు. జిల్లాలోని వైద్య విధాన పరిషత్ పరిధి ఆస్పత్రుల్లో ఇప్పటికే అన్ని సదుపాయాలు కల్పించారు. జిల్లాలో ఏడు డయాలసిస్ సెంటర్లు నెలకొల్పి 53 మిషన్లు అందుబాటులోకి తెచ్చారు. అన్ని ఆస్పత్రుల్లో డెంటల్, ఆర్థో, ఈఎన్‌టీ, గైనకాలజీ, ఫిజియోథెరపీ, బ్లడ్ బ్యాంక్‌లను ఏర్పాటు చేశారు. కానీ, సంతాన సాఫల్య కేంద్రం మాత్రం లేదు. దీనిని కూడా జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావాలని అధికారులు కృషి చేస్తున్నారు.
జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో..
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఓ గదిని కేటాయించి అందులో ఈ సంతాన సాఫల్య కేంద్రం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. జిల్లాలో కొత్తగూడెం సర్వజన ఆస్పత్రితోపాటు భద్రాచలం, మణుగూరు, పాల్వంచ, ఇల్లెందు, అశ్వారావుపేట ఏరియా వైద్యశాలలు, 29 పీహెచ్‌సీలు, 10 యూపీహెచ్‌సీలు, 376 సబ్ సెంటర్లు ఉన్నాయి. వీటి పరిధిలో ఏటా వేలాది జంటలు వివాహబంధంలోకి అడుగుపెడుతున్నారు. అందులో కొన్ని జంటలకు సంతానలేమి సమస్య ఎదురవుతోంది. వారి కోసం ఓ ఇద్దరు గైనకాలజిస్ట్‌లను అందుబాటులో ఉంచితే ఈ సెంటర్ ద్వారా ఎంతో మందికి వైద్యం అందుతుందని భావిస్తున్నారు.
ప్రతిపాదనలు పంపుతాం...
జిల్లాలో పలువురు దంపతులు సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నారు. వారి కోసం సంతాన సాఫల్య కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించాం. త్వరలో ప్రతిపాదనలు పంపిస్తాం. కేంద్రం అందుబాటులోకి వస్తే జంటలు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా పోతుంది. ఆర్థికభారం తప్పుతుంది.
–డాక్టర్ రవిబాబు, డీసీహెచ్‌ఎస్
సంతానలేమి సమస్యకు చెక్..


