అటవీ భూమి ఆక్రమణ?
అశ్వారావుపేట: మండలంలోని వినాయకపురం చిలకలగండి ముత్యాలమ్మ ఆలయం వెనుక అటవీ భూభాగం ఆక్రమణకు గురైనట్లు సమాచారం. దమ్మపేట రేంజ్ పరిధిలోని తిరుమలకుంట బీట్ పరిధిలో ఉన్న అటవీ భూమి సరిహద్దు దాటి కొందరు ఆక్రమణకు పాల్పడినట్లు తెలిసింది. అటవీ భూమి సరిహద్దును చూపే కాంపౌండ్ దిమ్మెలను దాటి ఫెన్సింగ్ నిర్మించి మరీ వ్యవసాయం చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అటవీ శాఖకు చెందిన దమ్మపేట, అశ్వారావుపేట రేంజ్‌లు, అటవీ అభివృద్ధి కార్పొరేషన్ సరిహద్దులుగా ఉంటాయి. దీంతో ముగ్గురి మధ్య ఉన్న అటవీ భూభాగాన్ని వినాయకపురం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు, కొందరు అధికారులు కబ్జా చేసి ఏళ్ల తరబడి వినియోగించుకుంటున్నట్లు ప్రచారం జరగుతోంది. ఈ విషయాన్ని దమ్మపేట రేంజ్ అధికారి దృష్టికి తీసుకువెళ్లగా బీట్ అధికారిని విచారణకు పంపుతామని, ఆక్రమణదారులను ఖాళీ చేయిస్తామని చెప్పారు.


