విద్యుదుత్పత్తిలో కేటీపీఎస్ భేష్
● ఏడో దశ కర్మాగారానికి జాతీయ స్థాయిలో మూడో ర్యాంక్ ● జెన్‌కోలో ప్రథమ స్థానం
పాల్వంచ: గత ఆర్థిక సంవత్సరం విద్యుత్ ఉత్పత్తిలో కేటీపీఎస్ ఆశాజనక ఫలితాలు సాధించింది. సూపర్ క్రిటికల్ సామర్థ్యం గల 800 మెగావాట్ల ఏడో దశ కర్మాగారం తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది. 79.04 పీఎల్‌ఎఫ్(ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్) సాధించి దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. గుజరాత్‌లోని లారా స్టేషన్ ప్రథమ, ఒడిశాలోని దార్లపల్లి ద్వితీయ స్థానాల్లో ఉండగా కేటీపీఎస్ ఏడో దశ తృతీయ స్థానంలో ఉంది. టీజీ జెన్‌కోలో మాత్రం ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ కర్మాగారం 2022 – 23లో 4211.3262 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి సాధించగా 2023 – 24లో 6,011.2768 మిలియన్ యూనిట్లు, 2024 – 25లో 5,538.9876 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి సాధించింది. ఇక 2023 – 24లో పీఎల్‌ఎఫ్‌లో 85.54 శాతం ఉండగా ఈ సారి 79.04 సాధించింది. బొగ్గు వినియోగం గతంలో 30,45,889 మెట్రిక్ టన్నులకు గాను 2024 – 25లో 29,88,125.90 మొట్రిక్ టన్నులకు తగ్గించారు.
టీజీ జెన్‌కోలో 5, 6 దశలూ రికార్డే..
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉన్న నేపథ్యంలో కేటీపీఎస్ 5, 6 దశల కర్మాగారం అత్యధిక రోజులు బ్యాక్ డౌన్‌లో నడిచింది. దీంతో పీఎల్‌ఎఫ్ తగ్గగా, నిరంతరాయ ఉత్పత్తిలో మాత్రం రికార్డ్ సాధించింది. పీఎల్‌ఎఫ్ 93.45 శాతంతో జెన్‌కోలో ద్వితీయ స్థానంలో నిలిచింది. 3,054.680 మిలియన్ల విద్యుత్ ఉత్పత్తి సాధించింది.
సమష్టి కృషితో రికార్డ్ స్థాయిలో ఉత్పత్తి
సమష్టి కృషితో రికార్డ్ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి సాధించాం. జెన్‌కోలో ప్రథమ స్థానం, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ గల 800 మెగావాట్లలో జాతీయ స్థాయిలో తృతీయ స్థానం సాధించాం. ఇందుకు సహకరించిన సిబ్బంది, అధికారులకు ధన్యవాదాలు. వచ్చే ఏడాది మరింత ఉత్పత్తి సాధించేలా కృషి చేస్తాం.
– కె.శ్రీనివాసబాబు, ఏడో దశ సీఈ
విద్యుదుత్పత్తిలో కేటీపీఎస్ భేష్


