ఐదుగురికి జరిమానా
కొత్తగూడెంటౌన్: డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన ఐదుగురికి జరిమానా విధిస్తూ కొత్తగూడెం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు బుధవారం తీర్పు చెప్పారు. పాల్వంచటౌన్ ఎస్‌ఐ సుమన్ వాహనాలు తనిఖీ చేస్తుండగా ఐదుగురు వ్యక్తులు అతిగా మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిని బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించగా అధిక మోతాదులో మద్యం సేవించినట్లు తేలింది. వారిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా విచారణ అనంతరం ఐదుగురికి రూ.6,500 జరిమానా విధిస్తూ జడ్జి మెండు రాజమల్లు తీర్పు ఇచ్చారు. అనంతరం సదరు వ్యక్తులు కోర్టులో జరిమానా చెల్లించారు.
ట్రాక్టర్ బోల్తాపడి వ్యక్తి మృతి
దుమ్ముగూడెం: ట్రాక్టర్ బోల్తాపడి మండలంలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన పడిగపాటి వెంకటకృష్ణారెడ్డి (39) మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ గణేశ్ కథనం ప్రకారం.. వెంకటకృష్ణారెడ్డి తన వ్యవసాయ అవసరాల నిమిత్తం ట్రాక్టర్ కొనుగోలు చేశారు. తన ట్రాక్టర్‌పైనే పొలానికి వెళ్తూ ముట్ల వాగు బ్రిడ్జి సమీపానికి వెళ్లేసరికి అదుపుతప్పి ఎడమవైపు ఉన్న కాల్వలో పడిపోయింది. ట్రాక్టర్ కింద పడిన వెంకటకృష్ణారెడ్డి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. అటుగా వాకింగ్ చేస్తున్న రామకృష్ణాపురం గ్రామానికి చెందిన వ్యక్తులు ఘటనను చూసి మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి భార్య విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం
పాల్వంచరూరల్: మద్యం మత్తులో పురుగులమందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండలంలోని దంతలబోరు ఎస్సీకాలనీలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కాలనీకి చెందిన వ్యవయ కూలీ కాటూరి సుందరం బుధవారం మద్యం మత్తులో ఇంట్లో గొడవపడి పురుగులమందు తాగాడు. కుటుంబ సభ్యులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెంనకు తరలించారు.
కేసు నమోదు
పాల్వంచరూరల్: మండలంలోని లక్ష్మీదేవిపల్లిలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ కమిటీలో తనకు స్థానం కలిపించలేదనే అక్కసుతో ఆలయ పూజారిని దుర్భాషలాడాడని, బోర్డును ధ్వంసం చేశాడమని తల్లాడ రామాచారిపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు నాంపల్లి వేణుగోపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ సురేశ్ వెల్లడించారు.
గుట్కా ప్యాకెట్లు, గుడుంబా స్వాధీనం ˘
ఇల్లెందురూరల్: మండలంలోని మర్రిగూడెం, పోచారంతండాల్లోని పలు దుకాణాల్లో బుధవారం రాత్రి కొమరారం పోలీసులు తనిఖీ చేశారు. మర్రిగూడెం గ్రామానికి చెందిన కమల్ ఇంటి నుంచి రూ.1,800 విలువ చేసే గుట్కా ప్యాకెట్లు, పోచారంతండాలో రాంబాబు ఇంట్లో ఐదు లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేశామని కొమరారం ఎస్‌ఐ సోమేశ్వర్ తెలిపారు.
ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య
పాల్వంచ: పట్టణంలోని ఓ ల్యాబ్ టెక్నీషియన్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల కథనం మేరకు.. గుండాల మండలం మార్కోడుకు చెందిన బొందు రాజు (25) పాల్వంచలోని ప్రైవేట్ ఆస్పత్రికి అనుసంధానంగా ఉన్న ఎక్స్‌రే ల్యాబ్‌లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. మంచికంటినగర్ ఏరియాలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చేతి నరాలు కట్ చేసుకుని, ఐరన్ రాడ్‌కు వైర్‌తో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య జ్ఞానేశ్వరి, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. పోలీసులు విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఐదుగురికి జరిమానా


