అశ్వారావుపేటరూరల్: ఆయిల్‌పాం టన్ను గెల ధర స్వల్పంగా పెరిగిందని ఆయిల్‌ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్‌రెడ్డి తెలిపారు. టన్ను ధర ఫిబ్రవరిలో రూ.20,871 ఉండగా రూ.129 పెరిగి రూ.21,000కి చేరిందని, మార్చి నుంచి సేకరించిన గెలలకు ఈ ధర అమలు చేస్తామని ఆయన చెప్పారు. కాగా, టన్ను ధర పెరగడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పీఆర్ డీఈగా నాగేందర్ బాధ్యతల స్వీకరణ
చుంచుపల్లి: పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం కొత్తగూడెం డివిజనల్ ఇంజనీర్‌గా జె.నాగేందర్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఇక్కడ డీఈగా పనిచేసిన సత్యనారాయణ ఇటీవల ఉద్యోగ విరమణ పొందారు. దీంతో డీఈగా నాగేందర్‌కు పదోన్నతి ద్వారా అవకాశం దక్కింది. నాగేందర్ 2015–17 వరకు కొత్తగూడెం మున్సిపాలిటీలో, తరువాత 2018–24 వరకు చుంచుపల్లి ఏఈగా పనిచేస్తూనే నాలుగు నెలల కిందట డీఈగా పదోన్నతి పొందారు. డీఈ నాగేందర్‌ను ఈఈ శ్రీనివాసరావు, పలువురు ఏఈలు, కాంట్రాక్టర్లు, ప్రజా ప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది కలిసి అభినందనలు తెలిపారు.
చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా కిరణ్‌రాజ్‌కుమార్
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి మెయిన్ ఆస్పత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా ఆర్జీ–1 ఏరియాలో ఏసీఎంఓగా విధులు నిర్వర్తిస్తున్న ఆర్.కిరణ్‌రాజ్‌కుమార్‌ను యాజమాన్యం నియమించగా.. ఆయన బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆస్పత్రి ఏసీఎంఓ ఎం.ఉష, డీవైసీఎంఓ జి.సునీల, డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బంది, ఏఐటీయూసీ కొత్తగూడెం ఏరియా బ్రాంచ్ నాయకులు జి.వీరస్వామి, గట్టయ్య, సుధాకర్, శేషగిరిరావు, మధు, కృష్ణ, హీరాలాల్, ప్రసాద్ పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు
ఇల్లెందురూరల్: మండలంలోని కొమరారం సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పదో తరగతి పరీక్షలు పూర్తి చేసుకున్న మాణిక్యారం గ్రామానికి చెందిన ఈసం సిద్ధార్థ్, ఇటీవలే ఇంటర్ పరీక్షలు పూర్తి చేసుకున్న అదే గ్రామానికి చెందిన పొనక విష్ణు కొమరారానికి బైక్‌పై బయలుదేరారు.
ముత్తారపుకట్ట గ్రామానికి చెందిన కల్తీ ప్రకాష్ గుండాల మండలం వెన్నెలబైలు గ్రామంలో వ్యవసాయ పనులు ముగించుకొని స్వగ్రామానికి బైక్‌పై వెళ్తున్నాడు. రెండు బైక్‌లు కొమరారం శివారులో ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కల్తీ ప్రకాష్‌ను 108లో ఇల్లెందు ఆస్పత్రికి తరలించారు. ఈసం సిద్ధార్థ్‌ను కుటుంబ సభ్యులు ఇల్లెందులోని ప్రైవేట్ ఆస్పత్రికి, పొనక విష్ణును కొమరారం పీహెచ్‌సీకి తరలించారు.
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవద్దు
ఖమ్మంవైద్యవిభాగం: విద్యార్థులు సైబర్ నేరాల బారిన పడొద్దని సైబర్ క్రైమ్ డీఎస్పీ ఫణీందర్ సూచించారు. ఖమ్మంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో బుధవారం ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. నకిలీ యాప్‌లు, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్, ఈ మెయిల్, ఫేస్‌బుక్ ఖాతాలతో పాటు బెట్టింగ్ గేమ్‌ల ద్వారా మోసాలకు పాల్పడే అవకాశముందని తెలిపారు. గుర్తుతెలియని సైట్లు, వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలనానరు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే 1930కు ఫోన్ చేయడం లేదా www. cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలని డీఎస్పీ తెలిపారు. ప్రిన్సిపాల్ రాజేశ్వరరావు, సరిత పాల్గొన్నారు.
స్వల్పంగా పెరిగిన ఆయిల్‌పాం గెలల ధర


