పెదవాగును సందర్శించిన ఏపీ అధికారులు
అశ్వారావుపేటరూరల్: మండలంలోని గుమ్మడవల్లి వద్ద గల పెదవాగు ప్రాజెక్టును గురువారం ఏపీ నీటి పారుదల శాఖ అధికారులు సందర్శించారు. గతేడాది జూలై 18న కురిసిన భారీ వర్షాలు, వరదలతో ప్రాజెక్టు ప్రధాన ఆనకట్టకు గండ్లు పడిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు తెలంగాణ, ఏపీ ఉమ్మడి పరిధిలో ఉండడంతో ఏపీ నీటిపారుదల శాఖ అధికారులు పరిశీలించి ఆయకట్టు రైతులతో మాట్లాడారు. ప్రాజెక్టు మరమ్మతుల కోసం ఏపీ వాటా నిధుల కేటాయింపు, మరమ్మతులు పూర్తి చేస్తే ఏపీలోని ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం తదితర అంశాలపై చర్చించారు. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్‌లో జరిగే గోదావరి రివర్ బోర్డు సమావేశానికి హాజరై, తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులతో చర్చిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏలూరు నీటిపారుదల శాఖ ఎస్‌ఈ నాగార్జునరావు, నీరు–ప్రగతి పథకం ఎస్‌ఈ వెంకటస్వామి, స్థానిక ఐబీ డీఈఈ కృష్ణ, ఏఈఈ శ్రీనివాసరావు పాల్గొన్నారు.


