‘కాలుష్య’ అనుమతులు రాగానే ఉత్పత్తి ప్రారంభం
సింగరేణి కొత్తగూడెం ఏరియా
జీఎం శాలెంరాజు
సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం ఏరియా పరిధిలోని వీకే–7 ఓసీకి ఎన్విరాన్‌మెంట్ క్లియరెన్స్ వచ్చిందని, ప్రస్తుతం కాలుష్య నియంత్రణ బోర్డు అనుమతుల ప్రక్రియ సాగుతోందని సింగరేణి ఏరియా జీఎం ఎం.శాలెంరాజు తెలిపారు. అవి వచ్చిన మూడు మాసాల్లో వీకే–7 ఓసీలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అనుమతులు రాగానే మట్టి పనులు ప్రారంభించి వీలైనంత త్వరలోనే ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఓసీకి సంస్థ నిర్దేశించిన 10 లక్షల టన్నుల లక్ష్యాన్ని సాధిస్తామని తెలిపారు. కొత్తగూడెం ఏరియాకు గత ఆర్థిక సంవత్సరంలో వీకే–7ఓసీ మినహాయించి ఏరియాలో 143.50 లక్షల టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించగా 144.18 లక్షల టన్నుల బొగ్గు వెలికితీశామని వివరించారు. అధికారులు శ్రీరమేష్, సూర్యనారాయణరాజు పాల్గొన్నారు.


