● భద్రాచలానికి 197, అక్కడి నుండి పర్ణశాలకు 30 ● హైదరాబాద్ భక్తులకు రిజర్వేషన్ కూడా..
ఖమ్మంమయూరిసెంటర్: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవం, పట్టాభిషేకానికి హాజరయ్యే భక్తుల సౌకర్యార్ధం ఆర్టీసీ ఖమ్మం రీజియన్ అధికారులు ప్రత్యేక సర్వీసులు నడిపించనున్నారు. ఈనెల 6, 7వ తేదీల్లో ఉమ్మడి జిల్లాలోని అన్ని డిపోల నుండి భద్రాచలానికి ఈ సర్వీసులు ఉంటాయి. అలాగే, హైదరాబాద్ నుండి భద్రాచలం, భద్రాచలం నుండి హైదరాబాద్‌కు సైతం బస్సులు ఏర్పాటు చేసి, రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇవి కాక ఖమ్మం నుండి హైదరాబాద్‌కు ప్రతీ పది నిమిషాలకో బస్సు నడిపించాలని నిర్ణయించారు. ఖమ్మం రీజియన్‌లోని డిపోల నుండి భద్రాచలానికి 197 ప్రత్యేక బస్సులు, భద్రాచలం నుండి పర్ణశాలకు 30 బస్సులు నడిపించనుండగా, భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా రీజియన్ మేనేజర్ ఏ.సరిరామ్ నేతృత్వాన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
రోజు వారి సర్వీసులకు అదనం
భద్రాచలం నుండి హైదరాబాద్, భద్రాచలం నుండి ఖమ్మంకు రోజువారి తిరిగే వంద సర్వీసులతో పాటు అదనంగా సర్వీసులు నడిపిస్తారు. ఈనెల 6వ తేదీన అదనంగా 35సర్వీసులు, భద్రాచలం నుంచి కొత్తగూడెంకు నిత్యం తిరిగే సర్వీసులకు తోడు అదనంగా పది బస్సులు ఏర్పాటు చేయనున్నారు. అంతేకాక కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుండి భద్రాచలానికి ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ బస్సులు నడుస్తాయి. భద్రాచలం నుండి మణుగూరుకు రోజు వారీగా తిరిగే ఎనిమిది బస్సులతో పాటు అదనంగా పది బస్సులు, సత్తుపల్లి నుండి 20 బస్సులు, మధిర నుండి 17 బస్సులు, ఇల్లెందు నుండి భద్రాచలానికి ఐదు బస్సులు నడిపించనున్నారు. ఇక ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు కేంద్రాలకే కాక భద్రాచలం నుండి హనుమకొండ, కరీంనగర్‌కు సర్వీసులు ఏర్పాటు చేయాలనే యోచనలో అధికారులు ఉన్నారు. కాగా, భద్రాచలం నుండి విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, ఏలూరు, కాకినాడ, అమలాపురం వైపు వెళ్లే బస్సుల కోసం జూనియర్ కాలేజ్ మైదానంలో ప్రత్యేక పాయింట్ ఏర్పాటుచేశారు. అక్కడి నుంచి ఆలయానికి వెళ్లేందుకు రెండు బస్సులు నడిపిస్తామని అధికారులు వెల్లడించారు.
ప్రత్యేక సర్వీసుల సమాచారం కోసం ఫోన్ నంబర్లు
డిపో సెల్ నంబర్
భద్రాచలం 99592 25987
ఖమ్మం కొత్త బస్టాండ్ 99592 25979
మణుగూరు 89853 61796
కొత్తగూడెం 99592 25982
ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు
శ్రీరామనవమి పురస్కరించుకుని భద్రాచలంలో స్వామివారి కల్యాణం తిలకించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు వస్తారు. రాకపోకల సమయాన ఎవరూ ఇబ్బంది పడకుండా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల నుండి ప్రత్యేక బస్సులు నడిపిస్తాం. ఈనెల 6న భక్తుల కోసం అన్ని బస్టాండ్ల నుండి రద్దీకి అనుగుణంగా బస్సులు ఉంటాయి. అంతేకాక భద్రాచలం నుంచి ఖమ్మం, హైదరాబాద్‌కు రెగ్యులర్ సర్వీసులు తోడు అదనపు సర్వీసులు నడిపిస్తాం.
– ఏ.సరిరామ్, ఆర్‌ఎం, ఖమ్మం రీజియన్
నవమి భక్తులకు ప్రత్యేక బస్సులు
నవమి భక్తులకు ప్రత్యేక బస్సులు


