● సమన్వయంతో పనిచేయాలి
భద్రాచలం: శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం, పట్టాభిషేకం మహోత్సవాల్లో అధికారులందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వేడుకల నిర్వహణపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రామయ్య కల్యాణానికి సీఎం రేవంత్ రెడి రానున్న నేపథ్యంలో అధికారులు, సిబ్బంది శనివారం నుంచే విధుల్లో ఉండాలని ఆదేశించారు. వీఐపీ, వీవీఐపీలు, భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు.
● సకలం సిద్ధం
స్వామివారి తలంబ్రాల పంపిణికీ 80, ప్రసాదాల పంపిణీకి 19 ప్రత్యేక కౌంటర్లు, 13 మెడికల్ క్యాంపులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. కల్యాణ మండపాన్ని 26 సెక్టార్లుగా విభజించి ప్రతి సెక్టార్‌కు ప్రత్యేక అధికారులను, పారిశుద్ద్య పనులకు ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. రోజూ లక్షన్నర లడ్డూలను భక్తులకు అందిస్తామని, 200 క్వింటాళ్ల తలంబ్రాలను సిద్ధం చేశామని వివరించారు. రెండు రోజులపాటు భద్రాచలం, సారపాకలలో ఉన్న వైన్ షాపులను మూయించాలన్నారు. అనంతరం మిథిలా స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించి పలు సలహాలు, సూచనలను అందించారు.
● అధికారులపై మంత్రి ఆగ్రహం
కూనవరం రోడ్డులో కరకట్ట నిర్మాణ పనుల్లో ఆలస్యంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరకట్ట పనులను పరిశీలించి మాట్లాడారు. మే 31 నాటికి పనులు పూర్తి చేయాలన్నారు. అటవీ అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్ పోదెం వీరయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఐటీడీఏ పీఓ బి.రాహుల్, ఎస్పీ రోహిత్‌రాజు, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఆర్డీఓ దామోదర్ రావు, ఈఓ రమాదేవి పాల్గొన్నారు.


