వైభవంగా ధ్వజారోహణం
భద్రాచలం: భద్రగిరి శ్రీసీతారామ చంద్రస్వామివారి నవాహ్నిక తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం ధ్వజారోహణాన్ని వైభవోపేతంగా జరిపారు. శ్రీ మహా విష్ణువుకి ప్రీతిపాత్రుడైన గరుత్మంతుని పటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేశారు. గరుడాధివాసం కార్యక్రమాన్ని కమనీయంగా జరిపారు. ఉదయం యాగశాలలో తిరువారాధన సేవాకాలం, నివేదన, మంగళ శాసనం, తీర్థప్రసాద వినియోగం నిర్వహించారు. అనంతరం ఎటువంటి విఘ్నాలూ కలుగకుండా ఉండడానికి సేనాధిపతి, విఘ్ననాశకుడు అయిన విశ్వక్సేనుడికి అర్చన జరిపి, కర్మణ, పుణ్యావాచనం, మూర్తి కుంభావాహన, భ్రదక మండల ఆరాధన, ద్వార తోరణ ఆరాధన జరిపి నవాహ్నిక దీక్షకు అగ్ని ప్రతిష్ఠాపన జరిపారు.
● గరుడ ప్రసాదం పంపిణీ
యాగశాల నుంచి గరుడ పటాన్ని ఆలయం చుట్టూ ప్రదక్షిణలతో అర్చక పరిచారక వేద పండితులు తీసుకుని రాగా బ్రహ్మోత్సవ రక్షణ నిమిత్తం గరుడాళ్వారులను ఆహ్వానించి ఆరాధన చేశారు. గరుడ మహా సంకల్ప ం, గరుడ గద్యనం, గరుడ మంగళాష్టకాలను తర్పానందంగా ప్రధానార్చకులు చదవగా గరుడ పటాన్ని మంగళ వాయిద్య ఘోష నడుమ ధ్వజారోహణం చేశారు. అనంతరం బలిహరణం జరిగింది. సంతానం లేనివారికి గరుడ ముద్దలను ప్రసాదంగా అందజేశారు. గరుడ ముద్ద తీసుకున్న వారికి సంతానం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. సాయంత్రం యాగశాలలో భేరీ పూజ నిర్వహించారు.
● నేడు ఎదుర్కోలు ఉత్సవం
సీతారాముల కల్యాణ వేడుకలకు ముందు వధూవరుల విశిష్టతలను వర్ణించే, గొప్పలను వివరించే ఎదుర్కోలు ఉత్సవం శనివారం సాయంత్రం నిర్వహించనున్నారు. వేడుకల్లో హిందూ, ముస్లింల సామరస్యాన్ని పెంపొందించేలా భక్తులందరిపై పన్నీరు, గులాల్ చల్లుతారు. భద్రాచలం దేవస్థానంలో గోల్కొండ నవాబైన తానీషాను స్మరింపజేస్తూ ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ జరపటం విశేషం. నవాహ్నిక తిరుకల్యాణోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం, సోమవారం పట్టాభిషేక మహోత్సవం జరపనున్నారు. పూజాది కార్యక్రమాల్లో ఆలయ ఈఓ ఎల్.రమాదేవి దంపతులు, ఏఈవోలు శ్రవణ్‌కుమార్, భవాని రామకృష్ణ, ఆలయ ప్రధాన అర్చకుడు విజయరాఘవన్, స్థానాచార్యులు కేఈ స్థలశాయి, వేదపండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు, అర్చకులు, వేద పండితులు, సిబ్బంది పాల్గొన్నారు.
నేడు కల్యాణంలో కీలక ఘట్టమైన ఎదుర్కోలు ఉత్సవం
తానీషాను స్మరిస్తూ భక్తులపై గులాల్ చల్లే విశేషం
రేపు సీతారాముల కల్యాణం, 7న పట్టాభిషేకం


