సీతమ్మ అందాలు.. రామయ్య గోత్రాలు.!
భద్రాచలం: శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో కీలక ఘట్టమైన ఎదుర్కోలు ఉత్సవం శనివారం కనుల పండువగా జరిగింది. శ్రీరామనవమికి ముందు రోజు వారివంశాల విశిష్టతలను, గొప్పతనాన్ని వివరించే ఈ వేడుక ఆద్యంతం ఆసక్తిగా సాగింది. గరుత్మంతుని వాహనంపై స్వామివారిని మిథిలా స్టేడియం ఎదురుగా ఉన్న వైకుంఠ ద్వారం వద్దకు తీసుకొచ్చి కొలువుదీర్చారు. అనంతరం మా వంశం గొప్పదంటే ... కాదు మా వంశమే గొప్పదని చెబుతూ సీతమ్మ వారివైపు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ బృందం, రామయ్య వారివైపు కమిషనర్ శ్రీధర్ బృందం చేరి వేడుక నిర్వహించారు. శ్రీ సీతారాముల వారి ౖవైభవాన్ని లోకానికి తెలియజెప్పేందుకే ఎదుర్కోలు ఉత్సవ కార్యక్రమం జరిపినట్లు పండితులు తెలిపారు. హిందూ, ముస్లింల మత సామరస్యాన్ని పెంపొందించే విధంగా భక్తులందరికీ పన్నీరు చల్లారు. గోల్కొండ నవాబైన తానీషాను స్మరింపజేస్తూ భద్రాద్రి ఆలయంలో ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఆ తర్వాత ఊరేగింపుగా స్వామివారిని ఆలయానికి తీసుకెళ్లారు. కాగా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ రమాదేవి, వేదపండితుడు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు, ప్రధాన అర్చకులు విజయరాఘవన్, రామకోటి స్వరూప్, ఆలయ అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
భక్తులను అలరించిన
ఎదుర్కోలు ఉత్సవం
సీతమ్మ అందాలు.. రామయ్య గోత్రాలు.!


