ఈదురు గాలులు.. వడగళ్లవాన | - | Sakshi
Sakshi News home page

ఈదురు గాలులు.. వడగళ్లవాన

Apr 8 2025 10:51 AM | Updated on Apr 8 2025 10:51 AM

ఈదురు

ఈదురు గాలులు.. వడగళ్లవాన

అశ్వారావుపేటరూరల్‌: జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన పడింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. సోమవారం అశ్వారావుపేట మండలంలో అకాల వర్షం, గాలి దుమారం రావడంతో మామిడి, మొక్కజొన్న పంటలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అశ్వారావుపేట, వినాయకపురం, మామిళ్లవారిగూడెం, ఆసుపాక, మల్లాయిగూడెం తదితర గ్రామాల్లో వడగళ్ల వాన కురిసింది. రామన్నగూడెం, పండువారిగూడెం, అనంతారం, నారాయణపురం, గాండ్లగూడెం గ్రామాల్లో పొలాల్లో ఉన్న మొక్కజొన్న, వేరుశెనగ, నాటు పొగాకు వర్షం కారణంగా స్వల్పంగా తడిసినట్లు రైతులు తెలిపారు. వాగొడ్డుగూడెం–రామన్నగూడెం మార్గంలో పలు చోట్ల ప్రధాన రహదారిపై వృక్షాలు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.

విరిగిపడ్డ చెట్లు

దమ్మపేట: మండలంలోని పలు చోట్ల ఉరుములు మెరుపులతో భారీగా వర్షం పడింది. దుమ్ముతో కూడిన ఈదురు గాలులు బలంగా వీచాయి. అంకంపాలెం, పట్వారిగూడెం, బాలరాజుగూడెం, జగ్గారం, మొద్దులగూడెం, మల్కారం గ్రామాల్లో వడగళ్లు పడ్డాయి. తీవ్రమైన గాలుల ప్రభావానికి బాలరాజుగూడెం, అంకంపాలెం గ్రామాల శివారులో రోడ్డుపై చెట్లు పడిపోగా, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పార్కలగండి ఆశ్రమ పాఠశాలలో పెద్ద చెట్టు వేళ్లతో సహ పక్కకు ఒరిగిపోయింది. మామిడి, మొక్కజొన్న పంటలకు స్వల్పం నష్టం జరిగింది.

కూలిన విద్యుత్‌ స్తంభాలు

పాల్వంచరూరల్‌: మండలంలో ఉరుములు, మెరుపులతో కూడి భారీ వర్షం కురిసింది. గాలివానకు ఉల్వ నూరు కొత్తూరు గ్రామాల మధ్య చెట్లు విరిగిపడ్డాయి. మూడు విద్యుత్‌ స్తంభాలు విరిగిపడటంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఏఈ రవీందర్‌ జగన్నాథపురం సబ్‌ స్టేషన్‌ నుంచి విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించారు. వర్షానికి వీధుల్లో వరద ప్రవహించింది. పంట పొలాల్లో ఆరబెట్టిన ధాన్యం, మిర్చి రాశులు తడవకుండా పరదాలు కప్పుకుని రక్షించుకున్నారు. వర్షం రెండు రోజులపాటు ఉంటుందని వాతవరణశాఖ హెచ్చరించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

గుండాల: ఆళ్లపల్లి, గుండాల మండలాల్లో గాలిదుమారం బీభత్సం సృష్టించింది. సోమవారం రాత్రి బలమైన గాలులు వీయడంతో రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. రాకపోకలకు ఆటంకం కలిగింది. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మామిడి తోటలల్లో కాయలు రాలిపోయాయి. పలు గ్రామాల్లో ఇళ్లపై రేకులు లేచిపోయాయి. ఉరుములు, పిడుగులతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ఇల్లెందు: ఇల్లెందులో సోమవారం సాయంత్రం ఈదురుగాలులు, వర్షంతో 6గంటల నుంచి రాత్రి 10గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కరెంట్‌ ఆఫీస్‌ వద్ద ఓ చెట్టు విరిగి కొమ్మలు విద్యుత్‌ తీగలపై పడడంతో అంతరాయం ఏర్పడింది.

ఈదురు గాలులు.. వడగళ్లవాన1
1/3

ఈదురు గాలులు.. వడగళ్లవాన

ఈదురు గాలులు.. వడగళ్లవాన2
2/3

ఈదురు గాలులు.. వడగళ్లవాన

ఈదురు గాలులు.. వడగళ్లవాన3
3/3

ఈదురు గాలులు.. వడగళ్లవాన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement