సమన్వయంతో సాఫీగా..
● భద్రాచలంలో ఘనంగా ముగిసిన శ్రీరామనవమి, పట్టాభిషేకం
● పనులను ప్రత్యక్షంగా పరిశీలించి,
సమీక్షించిన మంత్రులు పొంగులేటి, తుమ్మల
భద్రాచలం: రామభక్తులంతా భక్తితో ఎదురుచూసిన శ్రీరామనవమి వేడుకలు భద్రాచలంలో ఘనంగా జరిగాయి. పట్టాభిషేకం కార్యక్రమంతో ముఖ్య ఘట్టాలన్నీ పూర్తయ్యాయి. వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక శ్రీరామనవమి తిరుకల్యాణోత్సవాలు గత నెల 30న మొదలుకాగా, ఈ నెల 6న శ్రీరామనవమి, సోమవారం పట్టాభిషేకం జరిగాయి. ఈ వేడుకలు చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు భద్రాచలం చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు స్వయంగా ఈ వేడుకలకు హాజరై ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. దీంతో వేడుకల నిర్వహణకు జిల్లా యంత్రాంగం నెల రోజుల నుంచి శ్రమిస్తోంది.
ఎండ నుంచి ఉపశమనం
రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో భద్రాచలం ఒకటి. మార్చి నుంచే ఇక్కడ మండే ఎండలు మొదలవుతాయి. ఈసారి నవమి వేడుకలు ఏప్రిల్ 6న రావడంతో ఎండ, ఉక్కపోత నుంచి భక్తులకు ఉపశమనం కలిగించేందుకు మిస్ట్ ఫాగ్ సిస్టమ్‌ను చలువ పందిళ్ల కింద ఏర్పాటు చేశారు. ప్రతీ పది నిమిషాలకు ఓసారి భక్తులపై సన్నని చిరుజల్లులు కురవడంతో ఎండ వేడిమి నుంచి భక్తులకు ఉపశమనం లభించింది. తొమ్మిదేళ్ల తర్వాత ముఖ్యమంత్రి ఈ వేడుకలకు హాజరై పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. దేవస్థానం వెబ్‌సైట్‌ను ఆధునీకరించడంతోపాటు మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు.
తీరని సమస్యలు
భద్రాచలం వచ్చే భక్తులకు తాగునీరు అందించేందుకు నవమి రోజు వాటర్‌బాటిళ్లు విరివిగా అందుబాటులో ఉంచారు. కానీ ఒకరోజు ముందే సుదూర ప్రాంతాల నుంచి భక్తులు భద్రాచలం చేరుకున్నారు. ఇక్కడే వండుకుని నిద్ర చేసి కల్యాణ వేడుకలు చూడాలనుకునే భక్తులకు నీటి సమస్య, వసతి సమస్య వేధించింది. ప్రతీసారి అందుబాటులో ఉండే భారీ తాత్కాలిక షెడ్లు ‘ప్రసాద్’ పనులతో ఈసారి కనిపించలేదు. వీఐపీ తాకిడి పెరగడంతో ఉభయ దాతల టికెట్లకు కోత పడింది. కొద్ది మంది ఖర్చు చేసి ఈ టికెట్లు కొనుగోలు చేసినా వీఐపీ గ్యాలరీ, లైవ్ టెలికాస్ట్ ఏర్పాట్ల వల్ల వారికి కల్యాణవేదిక సరిగా కనిపించలేదు. ఎప్పటిలాగే మిథిలా స్టేడియం గ్యాలరీల్లో కూర్చున్న భక్తులకు పందిళ్లే అడ్డుగా వచ్చాయి. ఎల్‌ఈడీ తెరలపై కల్యాణ వేడుకలు వీక్షిస్తూ సంతృప్తి చెందాల్సి వచ్చింది. కరకట్ట, గోదావరి తీర ప్రాంతాలతో పాటుగా పట్టణంలో ముఖ్యకూడల్లో ఎల్‌ఈడీ టీవీలను ఏర్పాటు చేయకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఊహించని స్థాయిలో భక్తుల రాక పెరగగా.. తాత్కాలిక వసతి లేక కరకట్ట, గోదావరి ఒడ్డునే సేద తీరారు.
సమష్టిగా కృషి..
నవమి వేడుకలను విజయవంతం చేసేందుకు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధిలు సమష్టిగా పని చేశారు. మిథిలా స్టేడియంలో జరిగే పనులను మంత్రి పొంగులేటి స్వయంగా పరిశీలించి తగిన సూచనలు చేశారు. ఆ తర్వాత నవమి ఏర్పాట్లపై మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజులు అధికారులతో సమన్వయం చేసుకున్నారు. నీటి, ట్రాఫిక్ సమస్యలు తప్పితే వేడుకలు సాఫీగా జరిగాయి. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
సమన్వయంతో సాఫీగా..


