వైభవంగా సాగిన శ్రీరామ పట్టాభిసేకం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా సాగిన శ్రీరామ పట్టాభిసేకం

Apr 8 2025 10:51 AM | Updated on Apr 8 2025 10:51 AM

వైభవం

వైభవంగా సాగిన శ్రీరామ పట్టాభిసేకం

● అయోధ్యపురిగా మారిన మిథిలా స్టేడియం ● రాజదండం, రాజముద్రిక, రాజ ఖడ్గాలకు పూజలు ● సిరియపాదుక శ్రీ ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు ● పట్టాభిషేకానికి హాజరైన గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ

మంగళవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

పట్టాభిషేకానికి హాజరైన భక్తజనం

రాజ లాంఛనాలతో పట్టాభిషేకం..

పట్టాభిషేక రాజ లాంఛనాల అలంకరణ మధ్యాహ్నం 12 గంటలకు మొదలైంది. ముందుగా రాజదండాన్ని శ్రీరాముడి కుడిచేతిలో ఉంచారు. ఆ తర్వాత రాజముద్రిక తొడిగారు. రామదాసు చేయించిన పచ్చల పతకాన్ని శ్రీరాముడికి, చింతాకు పతకాన్ని సీతాదేవికి, రామమాడను లక్ష్మణుడికి అలంకించారు. శ్రీరాముడికి ఇరువైపులా చామరాలు ఉంచి, ఆపై స్వర్ణఛత్రాన్ని స్థిరం చేశారు. చివరగా రాజఖడ్గాన్ని రామయ్య ఎడమ చేతిలో ధరింపజేశారు. స్వర్ణ ఛత్రం నీడలో రాజముద్రిక, రాజదండం, రాజఖడ్గం ధరించిన తర్వాత పట్టాభిషేకం కార్యక్రమాన్ని రుత్విక్కులు ప్రారంభించారు. మండపత్రయంలోని మూడు కలశాల్లోని సమస్త దేవతలు, సమస్త జలాలు, రామపరివారంతో కూడిన మంత్రించిన జలాన్ని శ్రీరాముడిపై ప్రోక్షణ చేస్తూ పట్టాభిషేకం కార్యక్రమాన్ని జరిపి చివరగా మంగళహారతి సమర్పించారు.

మండప్రతయ ఆరాధన..

రుత్విక్కరణం తర్వాత పండితులు మండపత్రయ పూజలు ప్రారంభించారు. శ్రీరాముడి పట్టాభిషేకానికి సమస్త దేవతలు, సమస్త నదీ, సముద్ర జలాలతో పాటు రామపరివారాన్ని ఆవాహన చేయడం ఈ మండపత్రయ ఆరాధన ప్రధాన ఉద్దేశం. పట్టాభిషేకం వేదిక దిగువ భాగాన మూడు కలశాలను ఏర్పాటు చేశారు. మధ్య కలశంలో సముద్ర, నదీ జలాలను ఆవాహన చేశారు. ప్రధానంగా తూర్పున పూరీ, దక్షిణాన ధనుష్కోటీ, పశ్చిమాన ద్వారకకు చెందిన సముద్ర జలాలు అవాహన చేయగా ఆగ్నేయం నుంచి గంగా, నైరుతి నుంచి కృష్ణా, వాయువ్యం నుంచి గోదావరి, ఈశాన్యం నుంచి కావేరీ నదీ జలాలను ఆవాహన చేశారు. నదీ, సముద్ర జలాలను ఆవాహన చేసిన కలశానికి కుడివైపున ఉన్న కలశంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పాటు రామపరివారాన్ని ఆవాహన చేశారు. ఇందులో తూర్పున హనుమ, పడమర లక్ష్మణ, ఉత్తరాన శతృఘ్నుడు, దక్షిణాన భరతుడు, ఆగ్నేయంలో అంగదుడు, వాయువ్యంలో సుగ్రీవుడు, ఈశాన్యంలో విభీషణుడు, నైరుతిలో జాంబవతుడిని ఆవాహన చేశారు. ఎడమవైపు కలశంలో అష్టదిక్పాలకులను ఆవాహన చేశారు. పట్టాభిషేకం చేసే రాజముద్రికలో లక్ష్మీదేవిని, రాజదండంలో విశ్వక్సేనుడిని, చామరలో వైనతేయుడు, గరుత్మంతుడు, ఖడ్గంలో నందకుడు, స్వర్ణఛత్రంలో అనంతుడు, పాదుకల్లో ఆదిశేషుడు, దేవేరులు ధరించే ఆభరణాల్లో భూదేవిని ఆవాహన చేశారు. మండపత్రయ ఆరాధాన ముగిసిన తర్వాత శ్రీరాముడికి అష్టోత్తర శతనామార్చన చేశారు. అనంతరం త్రిదండి దేవనాథ జీయర్‌స్వామి ఆనాటి శ్రీరాముడి పాలన విశిష్టతలను వివరించారు.

ఆలయం నుంచి మిథిలా స్టేడియానికి..

పట్టాభిషేకాన్ని పురస్కరించుకుని సీతాసమేత శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి భక్తుల కోలాహలం నడుమ ప్రధాన ఆలయం నుంచి ప్రత్యేక పల్లకీలో ఉదయం 10:17 గంటలకు మిథిలా స్టేడియానికి చేరుకున్నారు. అర్చకులు మొదట విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం నిర్వహించారు. ఆ తర్వాత శ్రీరాముడికి పట్టాభిషేకం చేసేందుకు వీలుగా పండితులు రుత్విక్కులైన వశిష్టుడు, వామదేవుడు, జాబాలి, కశ్యపుడు, కాత్యాయనుడు, గౌతముడిని తమలో ఆవాహన చేసుకున్నారు.

హనుమంతుని మెడలో ముత్యాల దండ..

రామయ్య పట్టాభిషేకం అనంతరం రామయ్యకు ముత్యాల దండ ధరింప చేశారు. ఇదే దండను సీతాదేవి మెడలోనూ ధరింపచేశారు. చివరకు అదే దండను ఆంజనేయుడి మెడలో వేశారు. దీంతో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం ముగియగా.. పట్టాభిషేకం అనంతరం సీతాలక్ష్మణ సమేతుడైన రామయ్యకు తాతగుడి సెంటర్‌ వరకు రథోత్సవం నిర్వహించారు. రథస్థం రాఘవం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే’ అని బ్రహ్మ పురాణం చెబుతోందని, రథోత్సవంలో శ్రీ రాముడిని సేవించిన వారికి ముక్తి లభిస్తుందని అర్చకులు వివరించారు.

సిరియ తిరువుడి పట్టాభిషేకం..

వాల్మీకి రామయాణంలో పట్టాభిషేకానికి ముందు రోజు శ్రీరాముడు అయోధ్యను వదిలి వనవాసానికి వెళ్తారు. దీంతో ముందుగా శ్రీరాముడి పాదుకలకు పట్టాభిషేకం జరిగింది. ఆ తర్వాత రామయణ క్రమంలో సుగ్రీవుడికి, విభీషణుడికీ పట్టాభిషేకాలు జరిగాయి. ఆ తర్వాతే శ్రీరామ పట్టాభిషేకం జరిగింది. అయితే విష్ణువుకు అన్ని అవతారాల్లోనూ గరుత్మంతుడు సేవలు అందించగా రామావతారంలో మాత్రం హనుమంతుడు సేవ చేశాడు. దీంతో గరుత్మంతుడిని పెరియ తిరువుడిగా, హనుమంతుడిని సిరియ తిరువుడిగా కొలుస్తారు. శ్రీరాముడి పాదుకలతో మొదలైన పట్టాభిషేక మహోత్సవం సిరియ తిరువుడైన హనుమంతుడి పట్టాభిషేకంతో ముగిసింది.

పట్టువస్త్రాలు సమర్పించిన గవర్నర్‌

శ్రీరామ పట్టాభిషేక మహోత్సవానికి ప్రభుత్వం తరఫున గవర్నర్‌ పట్టువస్త్రాలు అందించడం ఆనవాయితీ. ఈ క్రమంలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ హాజరయ్యారు. ఉదయం 10 గంటల సమయంలో హెలీకాప్టర్‌ ద్వారా సారపాకలోని ఐటీసీ ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నేరుగా ప్రధాన ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం పట్టాభిషేకం జరిగే అయోధ్యాపురికి చేరుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, దేవాదాయ శాఖ కమిషనర్‌ శ్రీధర్‌, భద్రాచలం, ఇల్లెందు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఎస్పీ రోహిత్‌రాజ్‌, ఆలయ ఈఓ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా సాగిన శ్రీరామ పట్టాభిసేకం 
1
1/4

వైభవంగా సాగిన శ్రీరామ పట్టాభిసేకం

వైభవంగా సాగిన శ్రీరామ పట్టాభిసేకం 
2
2/4

వైభవంగా సాగిన శ్రీరామ పట్టాభిసేకం

వైభవంగా సాగిన శ్రీరామ పట్టాభిసేకం 
3
3/4

వైభవంగా సాగిన శ్రీరామ పట్టాభిసేకం

వైభవంగా సాగిన శ్రీరామ పట్టాభిసేకం 
4
4/4

వైభవంగా సాగిన శ్రీరామ పట్టాభిసేకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement