చేతబడి నెపంతో వ్యక్తి హత్య
దుమ్ముగూడెం: మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంకా చేతబడులంటూ కొందరు హత్యలు చేస్తున్నారు. జడ్.వీరభద్రాపురం గ్రామానికి చెందిన కొమరం రాముడు(53)ను చేతబడి చేస్తున్నాడనే నెపంతో ఉరి వేసి చంపి, గోనె బస్తాలో కుక్కి, చెరువులో పడేసిన అమానవీయ ఘటనకు సంబంధించి సీఐ అశోక్ మంగళవారం వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన కొమరం రాముడు గత మార్చి 11వ తేదీన గ్రామంలో జరిగిన వివాహానికి భార్యతో కలిసి వచ్చాడు. అనంతరం భార్య ఇంటికి వెళ్లగా రాముడు రాకపోవడంతో ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో మార్చి 16న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా గ్రామానికి చెందిన కొమరం వెంకటేశ్, మణుగూరు మండలం చిన్నరావిగూడెంవాసి పద్దం బాలరాజు మంగళవారం తామే హత్య చేశామని పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. కాగా, రెండు నెలల కిందట వెంకటేశ్ తమ్ముడు కొమరం రాంబాబు చర్ల వెళ్తుండగా.. కొమరం రాముడు ఎట్టు వెళ్తున్నావని ప్రశ్నించాడని, చర్ల వెళ్తున్నానని చెప్పడంతో ‘నువ్వు చచ్చిపోతావ్’ అని అన్నాడని వెంకటేశ్ పోలీసులకు తెలిపాడు. చర్ల నుంచి తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదంలో రాంబాబు మృతి చెందాడని, కొన్నేళ్ల కిందట తన తండ్రి మృతి చెందాడని, తన భార్య సైతం పక్షవాతానికి గురైందని, దీనికంతటికీ కారణం కొమరం రాముడు చేతబడి చేశాడని చెప్పాడు. దీంతోనే తన బావమరిది పద్దం బాలరాజుతో కలిసి, రాముడుకు మద్యం తాగించి ఉరివేసి చంపి, గోనె బస్తాలో మూటగట్టి చెరువులో పడేశామని విచారణలో అంగీకరించాడు. కాగా, మంగళవారం గ్రామంలోని చెరువు వద్దకు వెళ్లి గజఈతగాళ్లతో చెరువులో గాలింపు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలించామని సీఐ వెల్లడించారు. నిందితులను రిమాండ్‌కు తరలిస్తామని ఆయన పేర్కొన్నారు.
మృతదేహాన్ని చెరువులో పడేసిన వైనం
చేతబడి నెపంతో వ్యక్తి హత్య


