అకాల వర్షం.. ఆగమాగం..
ఇల్లెందురూరల్/అశ్వారావుపేటరూరల్/గుండాల/పాల్వంచరూరల్/టేకులపల్లి: జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలులతో చేతికందే దశలో ఉన్న పంటల నేలరాలాయి. ప్రధానంగా ఇల్లెందు, అశ్వారావుపేట, గుండాల, ఆళ్లపల్లి, చండ్రుగొండ, దమ్మపేట, పాల్వంచ, టేకులపల్లి తదితర మండలాల్లో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి పంట గింజదశక చేరకోగా భారీ వర్షాలతో పంట నీటమునిగింది. మామిడికాయలు నేలరాలాయి. మొక్కజొన్న 50 శాతానికి పైగా కోయగా, మిగిలిన పంట గాలిదుమారంతో నేలవాలింది. కోసిన మొక్కజొన్నలు సైతం కల్లాల్లో ఆరబెట్టగా వర్షాలతో తడిసి ముద్దయ్యాయి. నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షంతో కొన్ని ప్రాంతాల్లో మొక్కజొన్న గింజలు మొలకలు వస్తున్నాయి. అశ్వారావుపేట మండలంలో ఈ మూడింటితో పాటు వేరుశనగ, ముగన, కూరగాయల పంటలు సైతం దెబ్బతిన్నాయి. గుండాల మండలంలో పంటలతో పాటు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయి పలువురు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీ వృక్షాలు విరిగిపడి రవాణాకు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు విరిగిపడి అనేక గ్రామాల్లో సరఫరాకు అంతరాయం వాటిల్లింది. నష్టపోయిన తమకు ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు, బాధితులు వేడుకుంటున్నారు. అయితే మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు మాత్రం జిల్లాలో వరికి పెద్దగా ముప్పు వాటిల్లలేదని, మొక్కజొన్న పంటకు మాత్రం కొంతమేర నష్టం జరిగిందని చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 7,562 ఎకరాల్లో మామిడి సాగు కాగా, అందులో 20 శాతం మేర నేలరాలినట్టు అంచనా వేస్తున్నారు.
టేకులపల్లి: మండలంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపుల కారణంగా మొక్కజొన్న, మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. గంగారం, సంపత్‌నగర్, చింతోనిచెలక, బోడు గ్రామాల్లో మామిడి కాయలు రాలిపడ్డాయి.
అకాల వర్షం.. ఆగమాగం..


