అమ్మా.. ఇక నువ్వు లేవవా?
మృతి చెందిన ఆవు వద్ద లేగదూడ నరకయాతన
అశ్వాపురం: అశ్వాపురం మండలం రామచంద్రాపురం జీపీ శివలింగాపురం పల్లె ప్రకృతి వనం సమీపాన వేటగాళ్ల అమర్చిన ఉచ్చులో చిక్కుకుని ఆవు మృతి చెందింది. మల్లెలమడుగు జీపీ వలస ఆదివాసీ గుంపునకు చెందిన సోడె లక్ష్మయ్య ఆవు నాలుగు రోజులుగా కానరాకపోగా, మంగళవారం శివలింగాపురంలో చనిపోయి కనిపించింది. అయితే, నాలుగు రోజులుగా తల్లి కనిపించక 20రోజుల వయస్సు కలిగిన లేగదూడ తల్లడిల్లుతోంది. ఇంతలోనే ఆవు మృతి చెందిందనే సమాచారంతో రైతు కుటుంబం వెళ్తుండగా వారితో పాటు వచ్చిన లేగ దూడ తల్లిని తట్టి లేపేందుకు, పాలు తాగేందుకు యత్నించడం అందరినీ కలిచివేసింది.


