భద్రాద్రి బిడ్డ వాదనా పటిమ
● దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసులో ఎన్‌ఐఏ తరఫున వాదించిన విష్ణువర్ధన్‌రెడ్డి ● నిందితులు ఐదుగురికి ఉరిశిక్ష విధించిన హైకోర్టు ● ఎన్‌ఐఏ పీపీగా రాణిస్తున్న రెడ్డిపాలెం లాయర్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో ఐదుగురు నిందితులకు తెలంగాణ హైకోర్టు మంగళవారం మరణ శిక్ష విధించింది. ఈ కేసులో ఎన్‌ఐఏ తరఫున వాదించింది జిల్లా న్యాయవాది పత్తి విష్ణువర్ధన్‌రెడ్డి కావడం విశేషం. దిల్‌సుఖ్‌నగర్‌లో ప్రసిద్ధి చెందిన సాయిబాబా గుడికి వచ్చే భక్తులే లక్ష్యంగా 2013 డిసెంబర్ 21న బాంబు పేల్చగా 18మంది మృతి చెందారు. ఇదే ఘటనలో మరో 131 మంది గాయపడ్డారు. ఈ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం 2016 డిసెంబర్ 13న ఐదుగురు నిందితులకు మరణశిక్ష ఖరారు చేసింది. దీంతో నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. తొమ్మిదేళ్లుగా ఈ కేసుపై విచారణ కొనసాగుతుండగా, 18 కుటుంబాల ఆవేదనకు కారణమైన నిందితులకు ఏ శిక్ష పడుతుందనే ఉత్కంఠ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. కాగా, ఈ కేసులో నిందితులు తప్పించుకునేందుకు అవకాశం ఇవ్వకుండా కోర్టు ముందు బూర్గంపాడు మండలం రెడ్డిపాలెం గ్రామానికి చెందిన పి.విష్ణువర్ధన్‌రెడ్డి సమర్థమైన వాదనలు వినిపించారు. దీంతో దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబుపేలుళ్ల కేసులో ఐదుగురు నిందితులకు హైకోర్టు కూడా ఉరిశిక్ష ఖరారు చేసింది.
రెడ్డిపాలెం టు హైకోర్టు
విష్ణువర్ధన్‌రెడ్డి స్వస్థలం బూర్గంపాడు మండలం రెడ్డిపాలెం కాగా, ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదివారు. ఆ తర్వాత జక్కం పెద్ద బుచ్చయ్య మెమోరియల్ విద్యాసంస్థలో, ఆపై ఏలూరులోని సీఆర్.రెడ్డి కాలేజీలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌ఎం చదివారు. ఆ తర్వాత న్యాయవాద వృత్తిలోకి వచ్చిన విష్ణువర్ధన్‌రెడ్డి ఉమ్మడి ఏపీ హైకోర్టులో 2000 నుంచి వాదనలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో సహాయక సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా కేవలం 35 ఏళ్ల వయసులోనే 2010లో ఎంపికయ్యారు. ఆ తర్వాత 2014లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ)కి పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ)గా నియమితులయ్యారు. దేశరక్షణకు సంబంధించిన వ్యవహారాల్లో ప్రభుత్వం తరఫున ప్రతిభావంతంగా వాదనలు వినిపిస్తూ దోషులకు శిక్ష పడేలా చూశారు.
మృతుల్లో భద్రాద్రి వాసి..
2013 డిసెంబర్ 21న దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబుదాడిలో మృతి చెందిన వారిలో భద్రాద్రి జిల్లా యువకుడు కూడా ఉన్నాడు. ఈ ఘటనలో కొత్తగూడెం పట్టణానికి చెందిన అజాజ్ అహ్మద్(18) ప్రాణాలు కోల్పోగా, అప్పుడు ఆయన పాలిటెక్నిక్ చదువుతున్నాడు.
కీలక కేసుల్లో వాదనలు
దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లకు సంబంధించి తొలుత ఎన్‌ఐఏ కోర్టులో, ఆ తర్వాత హైకోర్టులో వాదనలు వినిపించిన విష్ణువర్ధన్‌రెడ్డి ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష పడేలా చేశారు. అంతకు ముందు ఎన్‌ఐఏ తరఫున గోకుల్ చాట్, లుంబిని పార్క్ బాంబు పేలుళ్ల ఘటనలోనూ ఆయన ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు పూరి జగన్నాథ్, చార్మిపై నమోదు కాగా, ఆ కేసులోనూ ప్రభుత్వం తరఫున వాదించారు. 2019లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఎన్నికై న విష్ణువర్ధన్‌రెడ్డి, తెలంగాణ నుంచి 47 వేల మంది లాయర్లకు ఇండియా బార్ కౌన్సిల్‌లో ప్రతినిధిగా ఉన్నారు. నల్సార్ వర్సిటీకి ఎగ్జిక్యూటివ్ అకడమిక్ కౌన్సిల్ మెంబర్‌గా 2019 నుంచి, నేషనల్ లా యూనివర్సిటీ, బెంగళూరులోని అకడమిక్ కౌన్సిల్‌లో సభ్యుడిగా కొనసాగుతున్నారు. కాగా, విష్ణువర్ధర్‌రెడ్డి తండ్రి పత్తి నర్సిరెడ్డి అప్పట్లోనే బీకాం పూర్తి చేసి ఐటీసీ, హెవీ వాటర్ ప్లాంట్‌లో కాంట్రాక్టర్‌గా వ్యవహరించారు.


