పచ్చి, పుచ్చు గెలలు..! | - | Sakshi
Sakshi News home page

పచ్చి, పుచ్చు గెలలు..!

Apr 9 2025 1:05 AM | Updated on Apr 9 2025 1:05 AM

పచ్చి

పచ్చి, పుచ్చు గెలలు..!

● పామాయిల్‌ ఫ్యాక్టరీకి తీసుకొస్తున్న రైతులు ● నాణ్యత లేక నూనె దిగుబడిపై ప్రభావం ● పట్టించుకోని ఉద్యోగులు, అధికారులు

అశ్వారావుపేట: వేసవి కాలంలో పామాయిల్‌ గెలల దిగుబడి తక్కువగా ఉంటుంది. ఈ సమయంలోనే ధర ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం టన్ను ధర రూ.21 వేలుగా ఉంది. అయితే పలువురు రైతులు పచ్చి, పుచ్చులు ఉన్న గెలలను ఫ్యాక్టరీకి తరలిస్తున్నారు. అధికారులు, సిబ్బంది మాత్రం గెలల నాణ్యతను పరిశీలించకుండానే అన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. దీంతో గెలల నుంచి రికవరీ అయ్యే నూనె శాతం తగ్గి.. మంచి గెలలు తెచ్చిన రైతులు కూడా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఏడాది మొత్తం రైతుల శ్రమ ఈ మూడు నెలల్లో ఆవిరైపోయే ముప్పు పొంచి ఉంది.

ఇదేం కొత్త కాదు..

ప్రస్తుతం అన్‌ సీజన్‌ కావడంతో దమ్మపేట మండలం అప్పారావుపేట ఫ్యాక్టరీని నడపకుండా అశ్వారావుపేట ఫ్యాక్టరీని మాత్రమే నడుపుతున్నారు. దమ్మపేట మండలంలో సన్న, చిన్నకారు రైతులు టన్నులోపు గెలలను అప్పారావుపేట ఫ్యాక్టరీకి చేర్చితే అక్కడి నుంచి రోజుకోసారి అశ్వారావుపేట ఫ్యాక్టరీకి ఆయిల్‌ఫెడ్‌ అంతర్గత రవాణా చేస్తోంది. ఇలా నిత్యం 30 నుంచి 40 టన్నుల గెలలు అప్పారావుపేట నుంచి అశ్వారావుపేట ఫ్యాక్టరీకి వస్తాయి. టన్నుకు మించి గెలలున్న రైతులు నేరుగా అశ్వారావుపేట ఫ్యాక్టరీకే తరలించాల్సి ఉంటుంది. ఇలా రోజుకు 300 నుంచి 450 టన్నులు అశ్వారావుపేట ఫ్యాక్టరీకి వస్తాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం గత సోమవారం అశ్వారావుపేట ఫ్యాక్టరీలో అన్‌లోడ్‌ చేస్తున్న మూడు ట్రాక్టర్లను పరిశీలించగా ఒక్కో ట్రాక్టర్‌కు పది వరకు పచ్చి గెలలు, పుచ్చు గెలలు ఉన్నాయి. ఇలా నిత్యం 10 నుంచి 20 శాతం పచ్చి, పుచ్చు గెలలు వస్తే రైతులకు గిట్టుబాటు ధర దక్కదు. గతంలో ట్రాక్టర్లలో గెలలు తరలించే క్రమంలో మధలో భారీ రాళ్లు పెట్టి కార్పొరేట్‌ రైతులు పంపేవారు. వీటిని కన్వేయర్‌ వద్ద తొలగించే వారు. ఆ తర్వాత సూపర్‌వైజర్లను ఏర్పాటు చేయడంతో రాళ్ల రవాణా తగ్గుముఖం పట్టింది. ఇక కొంతకాలంగా వేసవిలో పచ్చి, పుచ్చు గెలల రవాణా పరిపాటిగా మారింది. గెలలను నరికి లోడ్‌ చేసే ముఠాకు టన్నుల వారీగా చెల్లింపులు ఉంటాయి. యజమాని లేకుండా గెలలు నరికే క్షేత్రాల్లో పచ్చి, చచ్చు, పుచ్చు గెలలు లోడ్‌ చేసి పంపుతారు. ముఖ్యంగా అధిక ధర ఉన్నప్పుడు కౌలు రైతులు ఇలాంటి గెలలు తరలిస్తారనే ఆరోపణలు ఉన్నాయి.

బెదిరింపులు.. తాయిలాలు

గెలలు దిగుమతి చేసే సమయంలో కూలీలు పచ్చివాటిని గుర్తించి పక్కన పెడితే కొందరు రైతులు వారిని బెదిరిస్తున్నారని తెలుస్తోంది. దిగుమతి సమయంలో సూపర్‌వైజర్‌ ఉన్నా ఉపయోగం లేదు. ‘మేం తలుచుకుంటే మీ ఉద్యోగాలుండవు’ అంటూ కొందరు రైతులు బెదిరిస్తుండడంతో చిరుద్యోగులు ఏమీ చేయలేకపోతున్నారు. ఒకవేళ వారు చెప్పినట్లు నడుచుకుంటే నజరానాలు కూడా కురిపిస్తారు. గతంలో ఈ దందా సాయంత్రం వేళల్లో ఎవరూ చూడకుండా చేస్తే.. ఇప్పుడు మాత్రం పట్టపగలే సాగుతోంది. పచ్చి గెలల బాగోతం హమాలీ నుంచి మేనేజర్‌ దాకా తెలిసినా నోరు మెదపకపోవడం గమనార్హం.

పచ్చి, పుచ్చు గెలలు వేస్తే..

పచ్చి, పుచ్చు గెలలు క్రషింగ్‌ చేస్తే వాటిలో తేమ శాతం ఎక్కువగా ఉండడంతో సుమారు 30 శాతం వరకు నూనె ఉత్పత్తి తగ్గుముఖం పడుతుంది. ఏడాదిలో మూడు నెలల పాటు రికవరీపై దుష్ప్రభావం పడితే అది ఏడాది నూనె ధరపై ప్రభావం చూపుతుంది. ఆయిల్‌ఫెడ్‌కు క్షేత్ర స్థాయిలో సిబ్బంది లేకపోవడంతో రైతులు, ముఠా ఇష్టారాజ్యంగా గెలలు నరుకుతున్నా నియంత్రణ లేదు. మిగిలిన పంటల వలె తేమ, పక్వం పరిశీలించే యంత్రాలను ఆయిల్‌ఫెడ్‌ వినియోగించకపోవడం ఈ దుస్థితికి మరో కారణం.

పరిశీలించి వెనక్కి పంపుతున్నాం

ఫ్యాక్టరీకి వచ్చే గెలలను పరిశీలించాకే అన్‌లోడ్‌ చేయాలని సిబ్బందికి చెబుతున్నాం. రైతులు, సిబ్బంది కుమ్మక్కయ్యారనే విషయం మా దృష్టికి రాలేదు. పచ్చి గెలలు, చచ్చు గెలలుంటే నిర్మొహమాటంగా వెనక్కు పంపుతున్నాం. పూర్తిగా పక్వానికి వచ్చాకే గెలలను ఫ్యాక్టరీకి తీసుకురావాలని రైతులను కోరుతున్నాం.

– నాగబాబు, ప్లాంట్‌ మేనేజర్‌, అశ్వారావుపేట

పచ్చి, పుచ్చు గెలలు..!1
1/2

పచ్చి, పుచ్చు గెలలు..!

పచ్చి, పుచ్చు గెలలు..!2
2/2

పచ్చి, పుచ్చు గెలలు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement